Vijaypaul| మాజీ ఎంపీ, ప్రస్తుత ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు(Raghurama Krishnaraju)పై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన కేసులో సీఐడీ(CID) మాజీ అడిషనల్ ఎస్పీ విజయ్ పాల్(Vijay Paul)ను ఒంగోలు పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయనను పోలీసులు గుంటూరు కోర్టులో హాజరుపర్చారు. 11 పేజీల రిమాండ్ రిపోర్టును కోర్టు ముందుంచిన పోలీసులు.. విజయ్‌పాల్‌ను రిమాండ్‌కు ఇవ్వాలని కోరారు. ఈ కేసులో వాస్తవాలు రాబట్టేందుకు ఇంటరాగేషన్ అవసరమని పేర్కొన్నారు. రఘురామకు చిత్రహింసల కేసులో విజయ్‌పాల్ పాత్ర కీలకమని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. ఈ చిత్రహింసల వెనుక సూత్రధారులను కనుగొనాల్సి ఉందని తెలిపారు. దీంతో న్యాయమూర్తి విజయ్‌పాల్‌కు 14 రోజుల రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు.
కాగా 2021లో వైసీపీ ఎంపీగా ఉన్న రఘురామను అరెస్ట్ చేసిన సీఐడీ.. ఆయనను కస్టోడియల్ టార్చర్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై RRR ఇటీవల గుంటూరు పోలీసులకు ఫిర్యాదుచేశారు. దీంతో కూటమి ప్రభుత్వం ఈ కేసు విచారణాధికారిగా ప్రకాశం జిల్లా ఎస్పీని నియమించింది. ఈ కేసుకు సంబంధించి గతంలో విజయ్ పాల్‌ను ఎన్ని సార్లు విచారించినా తనకు ఏం గుర్తు లేదనే సమాధానమిచ్చారు. ఈ క్రమంలోనే ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే ఆయన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ నేపథ్యంలో ఒంగోలు ఎస్పీ కార్యాలయంలో మంగళవారం ఉదయం విచారణకు హాజరయ్యారు. సాయంత్రం వరకు విచారించిన ఎస్పీ దామోదర్.. రాత్రి 9 గంటల సమయంలో ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు.