అధికారుల ఉదాసీన వైఖరి కారణంగా ఒక స్వీపర్ కు ఏకంగా రూ. 28 లక్షల మేరకు జీతభత్యాలు చెల్లించాల్సి వచ్చింది. అనంతపురం జిల్లా గుత్తి పురపాలక సంఘంలో కారుణ్య కారణాలపై క్లాస్ ఫోర్ స్వీపర్ గా నియమితు రాలైన ఎస్.సులోచనకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ విభాగాలు కలిసి రూ. 28, 81,020 చెల్లించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ లోకాయుక్త జస్టిస్ పి. లక్ష్మణరెడ్డి ఆదేశాల మేరకు ఈ జీతభత్యాలను ఏక మొత్తంలో చెల్లించాల్సి వచ్చింది.
సులోచన భర్త చనిపోవడంతో కారుణ్య నియామకాల కారణంపై ఆమెను ప్రజారోగ్య కార్యకర్తగా 2012 మార్చి 19న నియమించడం జరిగింది. అప్పటి గుత్తి మునిసిపల్ కమిషనర్ ఆమెను ఈ ఉద్యోగంలో నియమించారు. 2012 ఏప్రిల్ 4వ తేదీన ఆమె విధుల్లో చేరడం జరిగింది. అయితే, ఈ నాలుగవ తరగతి ఉద్యోగి కేడర్ ను గుత్తి మునిసిపాలిటీకి బదిలీ చేయనందువల్ల ఆమె జీతభత్యాలను నిలుపుచేయడం
జరిగింది. ఆమె లోకాయుక్తను ఆశ్రయించడంతో ఆమెకు అప్పటి నుంచి ఇప్పటి వరకు అందవలసిన జీతభత్యాలను లెక్కగట్టి ఏక మొత్తంలో చెల్లించడం జరిగింది.