Hanuma vihari: భారత క్రికెటర్ హనుమ విహారి ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ACA)కు గుడ్‌బై చెప్పి సంచలన నిర్ణయం తీసుకున్నారు. 2025-26 దేశవాళీ సీజన్‌లో ఆయన త్రిపుర తరపున ఆడనున్నారు. ఆంధ్రా క్రికెట్‌తో తనకున్న పదేళ్ల అనుబంధాన్ని తెంచుకుంటూ, కొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టినట్లు విహారి తన ఎక్స్ (X) ఖాతాలో పోస్ట్ చేశారు.
Ys. Jagan : అక్రమాస్తుల కేసులో జగన్‌కు బిగ్ షాక్
విహారి ఈ కఠిన నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణం- సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీకి ఆంధ్రా జట్టులో ఆయనకు చోటు దక్కకపోవడమే. ఈ విషయమై ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో విహారి కీలక వ్యాఖ్యలు చేశారు. గత సీజన్‌లో తాను టీ20లకు ఎంపిక కానని అసోసియేషన్ చెప్పినప్పుడు, విజయ్ హజారే ట్రోఫీ కూడా ఆడనని స్పష్టం చేశానని తెలిపారు. అయితే అప్పుడు నారా లోకేష్ జోక్యం చేసుకుని, అన్నీ తన చేతుల్లో ఉంటాయని హామీ ఇవ్వడంతో జట్టు మారే నిర్ణయాన్ని విరమించుకున్నట్లు పేర్కొన్నారు.
ఆ హామీ కార్యరూపం దాల్చలేదు. నాకు అసోసియేషన్ నుండి మద్దతు లభించలేదు. గత ప్రభుత్వంలోనూ ఇలాగే జరిగింది, కొత్త ప్రభుత్వం వచ్చినా అదే పరిస్థితి. నేను ఈ రాజకీయాలన్నిటిలోకి వెళ్లాలనుకోవడం లేదు, కేవలం క్రికెట్‌పై దృష్టి పెట్టాలనుకుంటున్నాను” అని విహారి అన్నారు.
వినాయక చవితి రోజున, ACA నుండి ఎన్‌ఓసీ (NOC) కోసం విహారి దరఖాస్తు చేసుకోగా, 24 గంటల్లోనే మంజూరు కావడం గమనార్హం. ఇటీవల ముగిసిన ఆంధ్ర ప్రీమియర్ లీగ్‌లో అమరావతి రాయల్స్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన విహారి, 299 పరుగులు చేసి ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’గా నిలిచారు.
31 ఏళ్ల హనుమ విహారి భారత్ తరపున 16 టెస్టులు ఆడారు. దేశవాళీ క్రికెట్‌లో 84 మ్యాచ్‌లలో 6168 పరుగులు సాధించారు. ఆంధ్రా క్రికెట్‌లో రాజకీయ జోక్యంపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు క్రీడా వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.


