కాపులకు ఐదు శాతం రిజర్వేషన్(Kapu Reservations) అమలు చేయాలని కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు చేగొండి హరిరామ జోగయ్య(Harirama Jogaiah) సీఎం చంద్రబాబు(CM Chandrababu), డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan)కు బహిరంగ లేఖ రాశారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో 2019 ఆగస్ట్ 3వ తేదీన ఈడబ్ల్యూఎస్ కోటాలో కాపులకు ఐదు శాతం రిజర్వేషన్ కల్పించడం జరిగిందని లేఖలో గుర్తు చేశారు. అనంతరం వచ్చిన వైసీపీ ప్రభుత్వం కాపుల పట్ల కక్షపూరితంగా వ్యవహరించిందన్నారు. కాపులకు ఐదు శాతం రిజర్వేషన్ అమలు చేయలేదని విమర్శించారు.
ఈ పరిణామాల నేపథ్యంలో ఈడబ్ల్యూఎస్ కోటాలో 5 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని కాపు సంక్షేమ సేన హైకోర్టును కూడా ఆశ్రయించిందన్నారు. ఈ పిటిషన్‌పై వైసీపీ ప్రభుత్వం అభ్యంతరం చెబుతూ రిజర్వేషన్ అమలు చేయలేమని స్పష్టం చేసిందని చెప్పారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం కాపులకు 5 శాతం రిజర్వేషన్ ఇవ్వాల్సిందిగా హైకోర్టులో రివైండ్ కౌంటర్ దాఖలు చేయాలని కోరారు.
కాపు రిజర్వేషన్ల కోసం వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తాను ఆమరణ నిరాహార దీక్ష చేసినప్పుడు జనసేన నేత పవన్ కళ్యాణ్ సమీష్టి కృషి తీసుకుందామని చెప్పి దీక్షను విరమింపజేసినట్లు పేర్కొన్నారు. ఇక ఈ అంశంపై హైకోర్టులో ఈ నెల 28న విచారణ జరగనుందని..ఈలోపు రిజర్వేషన్ల పట్ల కూటమి ప్రభుత్వం స్టాండ్ ఏంటో చెప్పాలని కోరారు. కాపు రిజర్వేషన్ అంశంలో పవన్ కల్యాణ్ ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలన్నారు.