బ్రహ్మంగారిమఠం (తెలుగు ప్రభ) : ప్రజాపాలనను పల్లె ముంగిటకే తెచ్చామని గంభీర ఉపన్యాసాలు దంచికొట్టే అధికారుల నిర్లక్ష్యానికి జిల్లా బ్రహ్మంగారిమఠం మండలం నాగిశెట్టిపల్లె సచివాలయమే సజీవ సాక్ష్యం!పాముల పుట్టగా మారిన పాత భవనంలో ఉద్యోగులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని విధులు నిర్వర్తిస్తుంటే,లక్షల ప్రజాధనంతో నిర్మించిన నూతన భవనం అధికారుల అసమర్థతకు గుర్తుగా వెక్కిరిస్తోంది.
సచివాలయానికి వెళ్లడమంటే ఉద్యోగులకు,ప్రజలకు విధి నిర్వహణ కాదు..సాక్షాత్తు మృత్యువుతో పోరాటమే.పాత భవనం చుట్టూ పెరిగిన పొదలు,శిథిలావస్థకు చేరిన గదులు విషసర్పాలకు నిలయంగా మారాయి.గతంలో విధులు నిర్వహిస్తున్న ఒక ఉద్యోగిపైకి ఏకంగా త్రాచుపాము పడటంతో అక్కడున్న వారంతా దిగ్భ్రాంతికి గురయ్యారు.త్రుటిలో ప్రాణాపాయం తప్పినా ఆ భయం నుంచి సిబ్బంది ఇప్పటికీ తేరుకోలేకపోతున్నారు.
సచివాలయంలోకి అడుగుపెట్టాలంటేనే కాలు వణుకుతోందని,సేవలు పొందడానికి వచ్చే గ్రామీణులు భయంతో ఉలిక్కిపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఈ నిత్య నరకం నుంచి విముక్తి కల్పించేందుకు ప్రభుత్వం నిర్మించిన నూతన సచివాలయ భవనం అన్ని రకాలుగా పూర్తయినా,నేటికీ ప్రారంభానికి నోచుకోకపోవడం అధికారుల బాధ్యతారాహిత్యానికి పరాకాష్టగా నిలుస్తుంది.ఒకవైపు నూతన భవనం సిద్ధంగా ఉన్నా ఉపయోగించకపోవడంతో, రాత్రి వేళల్లో అది ఆకతాయిల తాగుబోతుల అడ్డాగా మారుతోంది.లక్షల రూపాయల ప్రజాధనం కాస్తా దుమ్ము కొట్టుకపోతుంటే చూస్తూ ఊరుకోవడం విడ్డూరంగా ఉంది.

