Thunderstorm Warning: ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతాన్ని ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం స్థిరంగా కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాబోయే రెండు రోజులు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ అధికారులు హెచ్చరించారు.
బుధవారం వర్షాలు కురిసే ప్రాంతాలు
బుధవారం నాడు ముఖ్యంగా కోనసీమ, కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాలతో పాటు రాయలసీమలోని కర్నూలు, కడప, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ వర్షాల కారణంగా కొన్ని ప్రాంతాల్లో రహదారులు జలమయం కావడం, లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యే అవకాశం ఉంది.
ఎల్లుండి (గురువారం)కూడా వర్షాల ప్రభావం కొనసాగనుంది. ముఖ్యంగా నెల్లూరు మరియు రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. బలమైన ఈదురు గాలులు కూడా వీచే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచించారు..
ముఖ్య సూచనలు
విపత్తుల నిర్వహణ శాఖ అధికారులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అకస్మాత్తుగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే సమయంలో చెట్ల కింద, విద్యుత్ స్తంభాల దగ్గర లేదా బహిరంగ ప్రదేశాల్లో నిలబడటం చాలా ప్రమాదకరం.ప్రజలు సురక్షితమైన భవనాల్లో లేదా ఇంటి లోపల ఉండాలి. వ్యవసాయ పనులు చేసుకునే రైతులు, కూలీలు వర్షం ప్రారంభమైన వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలి. పిడుగుల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు స్పష్టం చేశారు.


