Rain Alert in AP: సెప్టెంబర్‌లో ఎడతెరిపి లేని వర్షాల కారణంగా తెలుగు రాష్ట్రాల్లో జనజీవనం అతలాకుతలమైంది. వర్షాలు తగ్గు ముఖం పట్టాక.. సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. కాగా, ఈ రోజు తెలంగాణలో పలు చోట్ల భారీ వర్షం కురిసింది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌లోనూ రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి తీవ్ర అల్పపీడనంగా మారిందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) పేర్కొంది.
రాష్ట్రంలో రానున్న ఐదు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. కోస్తాంధ్ర, రాయలసీమలోని కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. భారీ వర్షాల దృష్ట్యా ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేసింది.
ఈ మేరకు మంగళవారం ఏపీఎస్‌డీఎంఏ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వివరాలు వెల్లడించారు. బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన తీవ్ర అల్పపీడనం బుధవారం మధ్యాహ్నానికి వాయుగుండంగా మారనుందని పేర్కొన్నారు. ఆ తర్వాత 24 గంటల్లో అది మరింత బలపడే అవకాశం ఉందని.. ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని వివరించారు.
వాయుగుండం ప్రభావంతో బుధవారం.. రాష్ట్రంలోని ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు పడతాయని ప్రఖర్ జైన్ పేర్కొన్నారు. ఈ నెల 23న బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదవుతాయని వివరించారు.
కాగా, వాతావరణ మార్పుల నేపథ్యంలో దక్షిణ కోస్తా తీరం వెంబడి గంటకు 35 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని జైన్ పేర్కొన్నారు. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని చెప్పారు. ఈ మేరకు ఈ నెల 25 వరకూ మత్స్యకారులు ఎవరూ చేపల వేటకు వెళ్లరాదని స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు. ఇక, భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.


