Tirumala| తిరుమలలో భారీ వర్షం(Heavy Rains) కురుస్తోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వర్షానికి భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షం ధాటికి అప్రమత్తమైన టీటీడీ(TTD) అధికారులు ఘాట్ రోడ్లలో వాహనదారులు జాగ్రత్తగా ప్రయాణించాలని సూచించారు. కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉండటంతో పాపవినాశనం, శ్రీవారి పాదాలకు వెళ్లే మార్గాలను తాత్కాలికంగా మూసివేశారు. వర్షం తగ్గిన వెంటనే ఆ రెండు మార్గాలను తెరుస్తామని ప్రకటించారు. ఇదిలా ఉంటే గోగర్భం, పాపవినాశనం పూర్తిగా నిండి వరద నీరు బయటకు వస్తోంది.
మరోవైపు భారీ వర్షానికి తిరుపతి రోడ్లు కూడా జలమయమయ్యాయి. ప్రధాన కూడళ్లలోని లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో అప్రమత్తమైన అధికారులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు. కాగా బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం కారణంగా ఏపీలోని పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. గురువారం తెల్లవారుజామున నుంచి వర్షాలు పడటంతో పాటు తీవ్ర చలిగాలులు వీస్తున్నాయి. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.