Rain Forecast for telugu states: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం కారణంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీడీఎంఏ) హెచ్చరించింది. ఈ వాయుగుండం నేడు పారదీప్ – గోపాల్‌పూర్ మధ్య తీరం దాటే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రస్తుతం విశాఖపట్నానికి దక్షిణ ఆగ్నేయ దిశలో కేంద్రీకృతమై ఉన్న ఈ తీవ్ర వాయుగుండం ఉత్తర వాయువ్య దిశగా పయనిస్తోంది.
రెడ్ అలర్ట్: శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, మరియు అనకాపల్లి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలకు రెడ్ అలర్ట్ జారీ చేయబడింది. ఈ జిల్లాల్లో భారీ వర్షాలతో పాటు అక్కడక్కడా అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మన్యం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఆకస్మిక వరదలు వచ్చే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఉత్తరాంధ్ర తీరం వెంబడి గంటకు 55 నుంచి 75 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ప్రజలకు హెచ్చరికలు, సూచనలు: తీవ్ర వాయుగుండం నేపథ్యంలో ప్రజలు పూర్తి అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. అత్యవసర ప్రయాణాలు తప్పా అనవసర ప్రయాణాలు చేయవద్దని తెలిపారు. అత్యవసరం అయితే తప్ప ఇంట్లో నుంచి బయటకు వెళ్లకూడదని అన్నారు. పిడుగులు పడే అవకాశం ఉన్నందున ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని, ఎప్పటికప్పుడు వాతావరణ హెచ్చరికలను గమనించాలని అధికారులు కోరారు.


