Saturday, November 15, 2025
Homeఆంధ్రప్రదేశ్AP & Telangana Rains: తెలుగు రాష్ట్రాలపై వాన కారు.. వచ్చే 3 రోజులు దంచికొట్టే...

AP & Telangana Rains: తెలుగు రాష్ట్రాలపై వాన కారు.. వచ్చే 3 రోజులు దంచికొట్టే ఛాన్స్.. ఈ జిల్లాలకు అలర్ట్!

Weather alert for Andhra Pradesh and Telangana : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తెలుగు రాష్ట్రాల వైపు కన్నెర్ర చేస్తోంది. రుతుపవనాలు చురుగ్గా కదులుతుండటంతో, రాబోయే మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది. ముఖ్యంగా ఉత్తర కోస్తాంధ్రపై దీని ప్రభావం అధికంగా ఉండనుందని, ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇంతకీ, ఏయే జిల్లాలకు ఆరెంజ్, యెల్లో అలర్ట్ జారీ చేశారు..? ఎక్కడెక్కడ వర్ష బీభత్సం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది..?

- Advertisement -

ఆంధ్రప్రదేశ్‌లో వర్ష బీభత్సం: అల్పపీడనం ప్రభావంతో రాబోయే 72 గంటల పాటు ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు దంచికొట్టనున్నాయి.

ఆరెంజ్ అలర్ట్ (అతి భారీ వర్ష సూచన): విజయనగరం, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉందని, ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు హెచ్చరించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు యంత్రాంగం సిద్ధమైంది.

ఎల్లో అలర్ట్ (భారీ వర్ష సూచన): విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు, కర్నూలు, నంద్యాల, కడప జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. ఈ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, వాగులు, వంకలు పొంగిపొర్లే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

తెలంగాణలోనూ తప్పని వాన గండం: అల్పపీడనం ప్రభావం తెలంగాణపై కూడా స్పష్టంగా కనిపించనుంది.

ఆరెంజ్ అలర్ట్ (అతి భారీ వర్ష సూచన): నారాయణపేట, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ అయింది. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.

ఎల్లో అలర్ట్ (భారీ వర్ష సూచన): హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాలతో పాటు ఉమ్మడి ఆదిలాబాద్, మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. ఈ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

రెండు రాష్ట్రాల్లోనూ భారీ వర్ష సూచన నేపథ్యంలో, విపత్తు నిర్వహణ బృందాలు, స్థానిక అధికారులు అప్రమత్తమయ్యారు. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు. ప్రజలు కూడా అనవసర ప్రయాణాలు మానుకుని, సురక్షితంగా ఇళ్లలోనే ఉండాలని ప్రభుత్వాలు విజ్ఞప్తి చేస్తున్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad