ఐఎండి అంచనాల ప్రకారం ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం శనివారం నాటికి తీవ్రవాయుగుండంగా బలపడనుందని విపత్తుల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డా. బి.ఆర్ అంబేద్కర్ తెలిపారు. ఇది పశ్చిమ వాయువ్య దిశగా పయనిస్తూ ఆదివారం నాటికి నైరుతి బంగాళాఖాతంలో తుఫానుగా మారనుందన్నారు. ఆ తర్వాత సోమవారం మధ్యాహ్ననికి దక్షిణకోస్తా మరియు ఉత్తర తమిళనాడు తీరాలకు చేరుకుంటుందని మంగళవారం మధ్యాహ్ననం నెల్లూరు – మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉన్నట్లు వెల్లడించారు.
దీని ప్రభావంతో ఆదివారం నుండి మంగళవారం వరకు రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు, అలాగే మంగళవారం అక్కడక్కడ అతితీవ్ర భారీ వర్షాలు నమోదైయ్యే అవకాశం ఉన్నట్లు మేనేజింగ్ డైరెక్టర్ డా. బి.ఆర్ అంబేద్కర్ తెలిపారు.
ఆదివారం నుండి కోస్తా తీరం వెంబడి గంటకు 55 -75 కీమీ వేగంతో బలమైన గాలులు వీస్తాయన్నారు. సముద్రం అలజడిగా ఉంటుందని మత్స్యకారులు మంగళవారం వరకు వేటకు వెళ్ళరాదన్నారు. రైతులు వ్యవసాయపనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
విపత్తుల నిర్వహణ సంస్థలో స్టేట్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని ఎప్పటికప్పుడు పరిస్థితులు పర్యవేక్షిస్తామన్నారు. జిల్లాల యంత్రాంగాన్ని ఇప్పటికే అప్రమత్తం చేసినట్లు తెలిపారు. ప్రజలు అత్యవసర సహయం, వాతావరణ సమాచారం కోసం 24 గంటలు అందుబాటులో ఉండే స్టేట్ కంట్రోల్ రూమ్ నెంబర్లు 1070, 112, 18004250101 సంప్రదించాలన్నారు.
-ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ