ఏపీలో ఒకపక్క ఎండలు మండుతున్నాయి. అయితే తాజాగా వాతావరణ శాఖ ఓశుభవార్త అందించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వచ్చే మూడు రోజులపాటు భారీ వర్షాలు కురిసే సూచనలు కనిపిస్తున్నాయి. తీర ప్రాంతాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు విరుచుకుపడతాయని హెచ్చరించింది. పిడుగులు, గాలి వానల ముప్పు కూడా ఉందని పేర్కొంది.
ఇక రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని, కొంత ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు పడే అవకాశముందని అధికారులు స్పష్టం చేశారు. ఎండలకు అలసిపోయిన ప్రజలకు ఇది ఓ ఊరట అని చెప్పాలి.
దీనితో పాటు కీలకమైన ప్రకటనను చేసింది వాతావరణ శాఖ. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు చాలా వేగంగా దేశంలో ప్రవేశిస్తున్నాయని వెల్లడించింది. సాధారణంగా జూన్ 1వ తేదీ వరకు రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకుతుంటాయి. కానీ ఈసారి మే 24 నుంచే రుతుపవనాలు కేరళలోకి అడుగుపెట్టాయి. కేరళతో పాటు తమిళనాడు, కర్ణాటక, మిజోరాం మీదుగా రుతుపవనాలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వైపు కదలుతున్నాయి.
ఈ నేపథ్యంలో సోమవారం నాటికి నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలో ప్రవేశించనున్నాయి. మరో 24 గంటల్లో రాయలసీమకు రుతుపవనాలు చేరుకుంటాయని అధికారులు అంచనా వేస్తున్నారు. రుతుపవనాల రాకతో రైతుల్లో హర్షాతిరేకం నెలకొంది. వర్షాలు పడే అవకాశం ఉండడంతో పంటల పనుల్లో నిమగ్నమయ్యే సన్నాహాలు చేస్తున్నారు. అయితే వర్షాలు బాగా కురిసే అవకాశం ఉన్నందున రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచిస్తోంది.