Heavy Rains forecast updates: బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం నేడు తీవ్ర వాయుగుండంగా మారే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంవో) సూచనలతో ఈ తుపాన్‌కు మోంథాగా నామకరణం చేసినట్టుగా పేర్కొన్నారు. దీని ప్రభావంతో రాగల మూడు రోజులు రాష్ర్టంలో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపింది. ఉరుములు, మెరుపులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో కూడిన ఈదురుగాలు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అంతేకాకుండా దక్షిణ అండమాన్ సముద్ర ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడినట్లు తెలిపారు.
ఏపీపై అధిక ప్రభావం: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. అల్పపీడనం పశ్చిమ, వాయువ్య దిశగా నెమ్మదిగా కదులుతోందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇది నేడు తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని తెలిపారు. ఇది రేపు నైరుతి, పశ్చిమ–మధ్య బంగాళాఖాతంలో తుపాన్‌గా మారే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. ఇప్పటికే దీని ప్రభావంతో పాకాలలో 15.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో అత్యధికంగా 6.3 సెంటీమీటర్ల వర్షం కురిసిందని వాతావరణ శాఖ పేర్కొంది. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం తాడువాయిలో 5.9 సెం.మీ, అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలం బుట్టాయగూడెం, కృష్ణా జిల్లా మచిలీపట్నంలో 5.5 సెం.మీ వర్షపాతం నమోదైంది.
బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావం: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అన్నారు. శని, ఆదివారాల్లో ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్, రంగారెడ్డి, హైదరాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో మోస్తవరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. శుక్రవారం నల్గొండ జిల్లా షాలి గౌరారంలో 9.3 సెం.మీ, సూర్యాపేట జిల్లా తిరుమల గిరిలో 7సెం.మీ వర్షం కురిసింది. జనగాం జిల్లా దేవరుప్పలలో 6.8సెం.మీ, జయశంకర్ భూపాలపల్లి జిల్లా కొయ్యూరులో 6.7సెం.మీ, మంచిర్యాల జిల్లా కొండాపూర్ లో 6.6 సెం.మీ, సూర్యాపేట్ జిల్లా చివ్వెంల 5.7 సెం.మీ, నల్గొండ మామిడాల లో 5.4 సెం.మీ, యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరులో 5.1 సెం.మీ, వనపర్తి జిల్ల వీపన్ గండ్ల లో 5 సెం.మీ చొప్పున వర్షాపాతం నమోదైంది.
రాష్ట్ర వాతావరణంలో కొంత మార్పు కనిపిస్తుంది. పగటి పూట శీతల వాతావరణం కనిపిస్తుండగా.. రాత్రి పూట మాత్రం ఉక్కపోతగా ఉంటుంది. బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడన ప్రభావంతో పగటి పూట చిరుజల్లులు కురుస్తున్నాయని వాతావరణ అధికారులు తెలిపారు. కొన్ని చోట్ల భారీ వర్షాలకు అవకాశం ఉందని పేర్కొన్నారు. దీంతో ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా రెండు నుంచి 4.8 డిగ్రీల సెల్సియస్ వరకు పడిపోయాయి. శుక్రవారం మహబూబ్ నగర్ లో పగటి పూట ఉష్ణోగ్రత సాధారణం కన్నా 4.8 డిగ్రీలు తగ్గి 27 డిగ్రీల సెల్సియస్ నమోదైందని తెలిపారు. నల్గొండలో 3.9, హైదరాబాద్ లో 3.7, హన్మకొండలో 3.2 డిగ్రీల వరకు పడిపోయాయని అన్నారు. అదే సమయంలో రాత్రిపూట మాత్రం సాధారణం కన్నా కొంత ఎక్కువగా ఉంటున్నాయి. దీంతో రాత్రిపూట ఉక్కపోతగా ఉంటుందన అధికారులు తెలిపారు. నైరుతి రుతుపవనాలు తిరోగమనం నేపథ్యంలోనే రాష్ట్రవ్యాప్తగా ఒక మోస్తరు వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.


