Thursday, January 22, 2026
Homeఆంధ్రప్రదేశ్Weather Update: ఏపీకి ముంచుకొస్తున్న తుఫాను గండం.. స్కూళ్లు, కాలేజీలకు సెలవు..!

Weather Update: ఏపీకి ముంచుకొస్తున్న తుఫాను గండం.. స్కూళ్లు, కాలేజీలకు సెలవు..!

Heavy Rains In Andhra Pradesh Next Four Days Due To Montha Cyclone: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మొంథా తుఫాను భయపెడుతోంది. ఏపీ వైపుగా దూసుకొస్తున్న తుపాను.. మరో మూడు రోజుల్లో తీరం దాటే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే తుఫాను ప్రభావిత జిల్లాల్లోని స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించాలని ప్రభుత్వానికి వాతావరణ శాఖ సూచించింది. మరోవైపు, ఆయా జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే మూడు రోజుల పాటు దక్షిణ కోస్తా జిల్లాలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. తుఫాను ప్రభావంతో రాబోయే మూడు రోజుల పాటు ఏపీలో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ నేపథ్యంలోనే అక్టోబర్ 27న బాపట్ల, ప్రకాశం, కడప, నెల్లూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాలలో 20 సెంటీమీటర్ల పైన వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. అలాగే నంద్యాల, చిత్తూరు, పల్నాడు, గుంటూరు, కృష్ణా, తూర్పుగోదావరి, కోనసీమ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది.

- Advertisement -

అక్టోబర్ 28, 29 సెలవులు ఇవ్వండి..

అక్టోబర్ 28వ తేదీ సాయంత్రం కాకినాడ సమీపంలో మొంథా తీవ్ర తుపాను తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. తుఫాన్ తీరం దాటే సమయంలో కాకినాడ, ఉభయ గోదావరి జిల్లాలు, ఏలూరు, గుంటూరు,పల్నాడు, బాపట్ల, ప్రకాశం, వైఎస్సార్ కడప జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అలాగే తీరం వెంబడి గంటకు 90 కిలోమీటర్ల నుంచి 110 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. తీవ్ర తుపాను నేపథ్యంలో ముందు జాగ్రత్తగా తీర ప్రాంత జిల్లాల్లోని విద్యాసంస్థలకు అక్టోబర్ 28, 29 తేదీల్లో సెలవు ప్రకటించాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. అలాగే దూరప్రాంత ప్రయాణాలను కూడా వాయిదా వేసుకోవాలని సూచించారు. భారీ వర్షాల నేపథ్యంలో విజయవాడ, మచిలీపట్నం, దివిసీమ, గుంటూరు, గోదావరి జిల్లాలు, ఏలూరు జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. మరోవైపు, శనివారం మధ్యాహ్నం రెండు గంటల సమయానికి.. ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతోంది. గంటకు 7 కి.మీ వేగంతో వాయుగుండం కదులుతోంది. ఈ వాయుగుండం పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ ఆదివారం నాటికి తీవ్ర వాయుగుండంగా మారుతుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. సోమవారం ఉదయానికి తుపానుగా బలపడే అవకాశం ఉందని, మంగళవారం ఉదయానికి తీవ్ర తుపానుగా మారొచ్చని అంచనా వేసింది. మంగళవారం రాత్రికి మచిలీపట్నం-కళింగపట్నం మధ్య కాకినాడ సమీపంలో తీరాన్ని దాటే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు. తీరం దాటే సమయంలో బలమైన ఈదురు గాలులు వీస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News