నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారింది. ప్రస్తుతం తమిళనాడు తీరానికి చేరువలో దిశను మార్చుకుని ఏపీ తీరం వెంబడి బలమైన ఈదురు గాలులతో పయనిస్తుందని వాతావరణ విభాగం హెచ్చరికలు జారీ చేసింది. దీని ప్రభావంతో వచ్చే మూడు రోజులు ఏపీలో విస్తారంగా వర్షాలు(Heavy Rains) కురుస్తాయని పేర్కొంది. ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది.
అల్పపీడనం కారణంగా దక్షిణ కోస్తా తీరంలో గంటకు గరిష్ఠంగా 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో అన్ని జిల్లాలకు హెచ్చరికలు జారీ చేశారు. మత్సకారులు వేటకు వెళ్లొద్దని.. రైతులు పంటలు కోసే సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించింది. కాగా అక్టోబర్‌లో దానా, నవంబర్‌లో ఫెంగల్ తుపానుల ప్రభావంతో కురిసిన భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడిన సంగతి తెలిసిందే. మరోసారి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఆందోళన చెందుతున్నారు.