Heavy rains in AP : ఏపీలో ద్రోణి ప్రభావంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. 46 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతతో ఉక్కిరిబిక్కిరైన ప్రజలకు వాతావరణ శాఖ చల్లటి కబురు అందించింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నేడు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. వాతావరణం చల్లబడినప్పటికీ పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
వర్షాలు కురిసే అవకాశం ఉన్న జిల్లాలు: ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కోస్తా ఆంధ్రలోని కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, పోలవరం ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు.. అలాగే రాయలసీమ జిల్లాలైన శ్రీసత్యసాయి, వైఎస్సార్ కడప, చిత్తూరు, తిరుపతిలో మోస్తరు నుండి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
వడగాల్పుల హెచ్చరిక: ఒకవైపు వర్ష సూచన ఉన్నప్పటికీ మరికొన్ని ప్రాంతాల్లో ఎండ తీవ్రత అధికంగా ఉండనుంది. ముఖ్యంగా అల్లూరి, ఏలూరు, పోలవరం జిల్లాల్లోని పలు మండలాల్లో వడగాల్పుల ప్రభావం ఉంటుందని అధికారులు తెలిపారు. అల్లూరి జిల్లా జికే వీధి, పోలవరం జిల్లా చింతూరు, గుర్తేడు మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.
Also read-TDP: మహానాడు వేదిక, తేదీలు ఫిక్స్.. జోష్‌లో టీడీపీ శ్రేణులు!
రైతుకు విజ్ఞప్తి: వర్షం పడే సమయంలో పొలాల్లో పని చేసే రైతులు, కూలీలు, పశువుల కాపరులు ఎట్టి పరిస్థితుల్లోనూ చెట్ల కింద ఉండరాదని అధికారులు సూచించారు. పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున సురక్షిత ప్రాంతాల్లో ఉండాలి. ఎండ తీవ్రతతో పాటు ఉక్కపోత అధికంగా ఉన్నందునా తగినంత ద్రవ పదార్థాలు తీసుకోవాలని అధికారులు సూచించారు.

