ఆపద సమయంలో అండగా ఉంటామని హొళగుంద మండల ప్రజల్లో భయాందోళన పోగొట్టేందుకు హైదరాబాద్ హకీంపేటలోని 99వ బెటాలియన్కు చెందిన రాపిడ్ యాక్షన్ ఫోర్స్ (ఆర్ఎఎఫ్) ఆదివారం ఉదయం హొళగుందలో కవాతు నిర్వహించింది. డిప్యూటీ కమాండెంట్ టి.పి. బాఘేల్ ఆధ్వర్యంలో హొళగుంద పోలీస్ స్టేషన్ పరిధిలోని స్థానిక పోలీస్ స్టేషన్ దగ్గర నుండి బస్టాండ్ ఈర్లకట్ట మీదుగా కోటవీధి పైకి వెళ్లి తిరిగి బస్టాండ్ కు చేరుకున్నారు. అనంతరం కొగిలతోట గ్రామానికి వెళ్లి ప్రతి వీధిలో కవాతు నిర్వహించారు.
నేరాల కట్టడికి స్థానిక పోలీసులు ఉన్నప్పటికీ అల్లర్లు, సంఘ విద్రోహ చర్యలు, మత కల్లోలాలు వంటి వాటిని దృష్టిలో పెట్టుకుని కవాతు నిర్వహించి ప్రజలకు భరోసా కల్పించారు. నీలిరంగు దుస్తుల్లో విభిన్న ఆయుధాలతో ఇన్స్పెక్టర్ ఎ కే శర్మ, ఇన్స్పెక్టర్ రాబిన్ బాబు, ఇన్స్పెక్టర్ జట శంకర్ తో పాటు సుమారు 65 మంది ఆర్ఎఎఫ్ సిబ్బందితో పాటు ఆలూరు సీఐ వెంకటేశ్వర్లు, స్థానిక ఎస్సై శ్రీనివాసులు, పోలీసు సిబ్బంది కూడా ఫ్లాగ్ మార్చ్ లో పాల్గొన్నారు.