Home Guard’s Narrow Escape: కాకినాడ జిల్లా కోటనందూరు పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఓ హోంగార్డుకు ఈ రోజు(మంగళవారం) వెన్నులో వణుకు పుట్టించే అనుభవం ఎదురైంది. విధులకు హాజరయ్యేందుకు కొత్తసూరవరం నుంచి బైక్‌పై బయలుదేరిన శివాజీకి, కాకినాడ జిల్లాలోని రేఖవానిపాలెం చేరుకోగానే సీటు కింద నుంచి ఓ వింత శబ్దం వినిపించింది.
ఉలిక్కిపడ్డ హోంగార్డు
బైక్‌ను పక్కన నిలిపి, సీటును కొద్దిగా పైకి లేపి చూడగానే శివాజీకి షాక్ తగిలింది. సీటు కింద నక్కి ఉన్న ఓ పాము బుసలు కొడుతూ ఒక్కసారిగా పైకి లేచింది. సాధారణంగా, చల్లదనం కోసం పాములు వాహనాల లోపల దాక్కుంటాయి. అయితే, బైక్ స్టార్ట్ చేసి ప్రయాణం మొదలుపెట్టడంతో ఇంజిన్ వేడి పెరిగి, పాము కంగారుపడి అలా స్పందించి ఉండవచ్చని స్థానికులు అభిప్రాయపడ్డారు.
గంటపాటు భీకర పోరాటం
అకస్మాత్తుగా జరిగిన ఈ ఘటనతో తీవ్ర ఆందోళనకు గురైన శివాజీ, వెంటనే సీటును మూసివేశారు. స్థానికుల సహాయంతో ఆ పామును బైక్ లోపలి నుంచి బయటకు పంపేందుకు గంటపాటు ప్రయత్నించారు. ఆ పామును నాగుపాముగా గుర్తించారు. కాటేసేందుకు సిద్ధంగా ఉండటంతో, ప్రాణనష్టం జరగకూడదనే ఉద్దేశంతో దాన్ని హతమార్చక తప్పలేదు. ఈ సంఘటన రేఖవానిపాలెంలో కొద్దిసేపు కలకలం సృష్టించింది. ఈ ఘటనతో రోజూ బైక్‌పై ప్రయాణించేవారు ముందుజాగ్రత్తగా తమ వాహనాలను తనిఖీ చేసుకోవడం అవసరమని మరోసారి రుజువైంది.


