Joy Jamima arrested again: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేకెత్తించిన జాయ్ జమీమా హనీట్రాప్ (వలపు వల) కేసు చాలా మందికి తెలిసే ఉంటుంది. అయితే తాజాగా.. తన అందచందాలు, మాయమాటలతో వల వేసి లోకల్ నుంచి ఎన్‌ఐఆర్‌ల వరకు బుట్టలో వేసుకుని, భారీగా డబ్బులు గుంజే జమీమా మరోసారి అరెస్ట్ అయింది! ఇప్పుడు పోలీసుల రిమాండ్‌లో ఉంది.
హలో అంటూ హస్కీ వాయిస్‌తో పలుకుబడి ఉన్న వాళ్లను, ఉన్నత వర్గాలు, బిజినెస్‌మెన్లను ట్రాప్ చేసి, మత్తు మందు ప్రయోగించి, ఏకాంత ఫొటోలతో బెదిరింపులకు పాల్పడ్డటం జమీమ్ స్టయిల్ ఆఫ్ చీటింగ్. అలా పెద్ద మొత్తంలో వెనకేసినట్టు జమీమాపై ఆరోపణలు, కేసులు ఉన్నాయి. అయితే ఈ మధ్యే బెయిల్‌పై విడుదలైన జమీమాను, మరోసారి పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలిసింది.
కాగా, గతంలో పశ్ఛిమ బెంగాల్‌కు చెందిన ఓ వ్యక్తిని మోసగించిన కేసులో.. చాలా మంది జమీమాకు సహకరించినట్టు పోలీసులు గుర్తించారు. ఇందులో భాగంగానే ఫారెస్ట్ అధికారి వేణు భాస్కర్‌రెడ్డిని అరెస్ట్ చేశారు. హనీ ట్రాప్ కోసం జమీమా ప్రత్యేకంగా ఓ గ్యాంగ్‌ను మెయిన్‌టెయిన్ కూడా చేస్తోంది. ఇప్పుడా ముఠా మూలాలన్నింటిని వెలికితీసే పనిలో పడ్డారు పోలీసులు.
జమీమా వల్ల మోసపోయిన బాధితులు విశాఖపట్నం మాత్రమే కాకుండా ఇతర జిల్లాలు, రాష్ట్రాల్లో కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఆమె చేతిలో మోసపోయిన కొంతమంది వ్యక్తులు తీవ్ర మానసిక ఒత్తిడికి లోనై, ఆత్మహత్యయత్నాలకు కూడా పాల్పడ్డారని సమాచారం. బయటకు వచ్చి ఫిర్యాదు చేయాలన్నా, వ్యక్తిగత పరువు పోతుందనే భయంతో చాలా మంది బాధితులు ఇప్పటికీ నిశ్శబ్దంగా ఉంటున్నారని పోలీసులు చెబుతున్నారు. “బయటకు వచ్చి ధైర్యంగా ఫిర్యాదు చేయండి. మీ వ్యక్తిగత సమాచారం గోప్యంగా ఉంచుతాం. జమీమాపై కఠిన చర్యలు తీసుకునేందుకు మీ సహకారం అవసరం” అని పోలీసు అధికారులు పేర్కొన్నారు.


