House arrest of YCP Leaders Ahead of Hindupur MLA Balakrishna RoadShow: హిందూపూర్‌లో వైసీపీ ఆఫీస్‌పై అధికార టీడీపీ కార్యకర్తలు చేసిన దాడిపై రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చ నడుస్తోంది. ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ హిందూపురం రాజకీయాన్ని రచ్చకీడుస్తున్నారు. ఈ నేపథ్యంలోనే హిందూపూర్ ఎమ్మెల్యే బాలకృష్ణ పర్యటన సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది. బాలకృష్ణ నేడు (ఆదివారం) శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో పర్యటిస్తున్నారు. సోమేందేపల్లిలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించనన్నారు. మంత్రి సవిత ఆధ్వర్యంలో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అక్కడ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొని బాలకృష్ణ ప్రసంగించనున్నారు. అయితే, తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో బాలకృష్ణ ఎలా స్పందిస్తారనే దానిపై సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది. సహజంగానే డైరెక్టుగా మాటల తూటాలు పేల్చే బాలయ్య.. వైసీపీపై నేతల తీరుపై ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే, హిందూపురంలోని వైసీపీ ఆఫీసుపై దాడి కేసులో ఇరుపార్టీల నేతలు, కార్యకర్తలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. దాడి ఘటనలో 16 మంది టీడీపీ నాయకులపై హత్యాయత్నం కేసులు నమోదు అయ్యాయి. హిందూపురం వైసీపీ ఇన్‌ఛార్జ్ దీపిక భర్త వేణురెడ్డితో పాటు మరో ఎనిమిది మందిపై ఎస్సీ-ఎస్టీ అట్రాసిటీ, హత్యాయత్నం కేసులు నమోదు చేశారు పోలీసులు.
Read Also: https://teluguprabha.net/national-news/nitish-kumar-will-be-the-next-chief-minister-of-bihar/
పలువురు వైసీపీ నేతల హౌస్ అరెస్ట్..
ఈ నేపథ్యంలో హిందూపూర్ ఎమ్మెల్యే బాలకృష్ణ హిందూపూర్ వెళ్లారు. ఆయనను అడ్డుకునేందుకు వైసీపీ నేతలు, కార్యకర్తలు ప్లాన్ చేశారు. ఈ నేపథ్యంలో వారిని హిందూపూర్‌కు వెళ్లకుండా నాయకులకు నోటీసులు ఇచ్చి హౌస్ అరెస్ట్ చేస్తున్నారు పోలీసులు. ఇప్పటికే మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్, మాజీ మంత్రి ఉషశ్రీలను హౌస్ అరెస్ట్ చేశారు. ఈ ఘటన గురించి తెలుసుకునేందుకు ఎమ్మెల్యే బాలకృష్ణ అక్కడికి వెళ్లారు. పార్టీ నేతలు, కార్యకర్తల నుంచి పూర్తి వివరాలు తీసుకున్నట్లు సమాచారం. ఇదిలావుండగా ఘటన ముందు, ఆ తర్వాత వేణురెడ్డి వ్యాఖ్యలు మాత్రం రెచ్చగొట్టేలా ఉన్నాయిని టీడీపీ నేతలు చెబుతున్నారు. ఇంతకీ ఘటన తర్వాత వేణురెడ్డి ఏమన్నారు? అధికారం చేతిలో ఉందని టీడీపీ కార్యకర్తలు హిందూపురంలో మా పార్టీ ఆఫీస్‌పై దాడి చేశారని ఆరోపిస్తున్నారు. ఒక చెంపపై కొడితే మరో చెంప చూపించడానికి తామేమీ గాంధీలం కాదని, వైసీపీ కార్యకర్తలమని అంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. మీ అరాచకాలు ఇలానే కొనసాగితే.. జగన్ 2.O ఎలా ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నామంటూ సవాలు విసిరారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్కర్నీ వదలమని టీడీపీ నేతలను హెచ్చరించారు. ఈ హెచ్చరికల నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దీంతో హిందూపూర్‌లో టెన్షన్ వాతావరణం నెలకొంది.

