వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని(Perni Nani)కి ఏపీ హైకోర్టులో భారీ ఊరట దక్కింది. రేషన్ బియ్యం గోడౌన్ నుంచి తరలించిన కేసులో పేర్ని నాని ఏ6 నిందితుడిగా ఉన్నారు. దీంతో తనను అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో ఏ1గా పేర్ని నాని భార్య పేర్ని జయసుధ, ఏ2గా మానస్ తేజ్, ఏ3గా కోటిరెడ్డి, ఏ4గా మంగారావు, ఏ5గా బాలాంజనేయులు ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి పేర్ని జయసుధకు ఇప్పటికే కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే.
కాగా పేర్ని నాని భార్య జయసుధ పేరు మీద ఉన్న గోదాములో 378 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం మాయమైనట్లు అధికారులు గుర్తించారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కొంతమందిని అరెస్ట్ కూడా చేశారు. త్వరలో పేర్ని నానిని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉందనే వార్తల నేపథ్యంలో ఆయనకు హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.