ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో మహోన్నత ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. ఐదు కోట్ల మంది ఆంధ్రుల కల అయిన రాజధాని అమరావతి(Amaravati) పున:ర్నిర్మాణ పనులకు అడుగు పడనుంది. ఇలాంటి అద్భుతమైన వేడుకను చూసేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజలు అమరావతికి తరలివస్తున్నారు. ప్రజల కోసం ప్రభుత్వం రవాణా, ఆహార సదుపాయాలను ఏర్పాటు చేసింది. ప్రతి బస్సుకు ఒక ప్రభుత్వ అధికారిని ఇంఛార్జిగా నియమించింది. బస్సులోనే అల్పాహారం, మధ్యాహ్న భోజనం, తాగునీటి సదుపాయాన్ని కల్పించింది. మరోవైపు సొంత వాహనాల్లోనే ప్రజలు అమరావతి చేరుకుంటున్నారు. దీంతో అమరావతికి వెళ్లే దారులన్నీ కిక్కిరిసిపోయాయి.
మరోవైపు రాజధాని అమరావతి ప్రాంతంలోనూ సందడి వాతావరణం నెలకొంది. అమరావతి పరిధిలోని తుళ్లూరులో రైతులు, రైతు కూలీలు ర్యాలీ నిర్వహించారు. దివంగత సీఎం ఎన్టీఆర్, అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి అంజలి ఘటించారు. అమరావతిని రక్షించేందుకు గత ఐదేళ్లు తాము చేసిన పోరాట ఫలితం సహకారం కాబోతోందని సంతోషం వ్యక్తం చేశారు. ప్రజలంతా స్వచ్ఛందంగా తరలిరావాలని పిలుపునిచ్చారు. ప్రధాని సభలో తమకు ప్రత్యేక గ్యాలరీ ఏర్పాటు చేసినందుకు రైతులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు