Chevireddy Bhaskar Reddy 18 crore fraud : హైదరాబాద్‌లో వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరును వాడుకుని ఓ మహిళ రూ.18 కోట్ల మోసానికి పాల్పడిన దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. డబ్బులు తిరిగి ఇవ్వమని అడిగిన బాధితులపై ఆమె కుటుంబ సభ్యులతో కలిసి సుత్తి, ఇనుప రాడ్లతో దాడి చేసింది. ఈ ఘటనలో ఓ మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. పటాన్‌చెరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ALSO READ: PASSENGER WOES: రామగుండానికి రైలు కష్టాలు.. స్టేషన్‌లో ఆగని సూపర్‌ఫాస్ట్‌లు!
సికింద్రాబాద్‌లోని సీతాఫల్‌మండికి చెందిన విద్య అనే మహిళ ఈ మోసానికి సూత్రధారి. రెండేళ్ల క్రితం ఆమె వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సహకారంతో కంటెయినర్ల వ్యాపారం చేస్తున్నానని స్థానిక గృహిణులను నమ్మించింది. పెట్టుబడి పెడితే రెట్టింపు లాభం ఇస్తానని ఆశ చూపి, లక్షలాది రూపాయల నగదు, బంగారు ఆభరణాలను వసూలు చేసింది. ఈ విధంగా సుమారు రూ.18 కోట్లు సేకరించినట్టు పోలీసులు తెలిపారు.
కొంత కాలం తర్వాత బాధితులకు అనుమానం రావడంతో విద్యను నిలదీయడం మొదలెట్టారు. దీంతో ఆమె సీతాఫల్‌మండిలోని ఇంటిని ఖాళీ చేసి, పటాన్‌చెరు సమీపంలోని ఏపీఆర్ గ్రాండియా కాలనీలోని ఓ విల్లాకు మారిపోయింది. ఆమె ఆచూకీ తెలుసుకున్న బాధితులు గురువారం ఆమె నివాసానికి వెళ్లి డబ్బులు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంలో విద్య, ఆమె భర్త దిద్ది రాజశేఖర్, అతని సోదరులు రంజిత్, శివ, నిఖిల్, విద్య కుమారుడు అభి, ఇంట్లో పనిచేసే స్వప్న కలిసి బాధితులపై దాడికి దిగారు. కర్రలు, సుత్తి, ఇనుప రాడ్లతో చేసిన ఈ దాడిలో కళమ్మ అనే మహిళ తలకు తీవ్ర గాయమైంది. బాధితుల ఫిర్యాదు మేరకు పటాన్‌చెరు పోలీసులు కేసు నమోదు చేసి, నిందితులను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. రాజకీయ నాయకుల పేర్లను దుర్వినియోగం చేస్తూ మోసాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు ఈ కేసులో మరింత లోతుగా దర్యాప్తు చేస్తూ, బాధితులకు న్యాయం చేసేందుకు కృషి చేస్తున్నారు.


