తెలంగాణ నుంచి ఇటీవల రిలీవ్ అయిన నలుగురు ఐఏఎస్ అధికారులు ఏపీ సీఎం చంద్రబాబును కలిశారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వెళ్లిన అధికారులు ఆమ్రపాలి కాట, రోనాల్డ్ రోస్, వాకాటి కరుణ, వాణిప్రసాద్.. ఆయనతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. అంతకుముందు ఇదే అధికారులు గురువారం ఉదయం వెలగపూడిలోని సచివాలయానికి చేరుకుని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్‌ను కలిసి జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చారు.
కాగా గత పదేళ్ల నుంచి తెలంగాణలో విధులు నిర్వహిస్తున్న ఏపీ కేడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారులు, ఏపీలో విధులు నిర్వహిస్తున్న తెలంగాణ కేడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారులు తిరిగి వారి సొంత రాష్ట్రానికి వెళ్లాలని డీవోపీటీ(DOPT) ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే DOPT ఆదేశాలపై వీరు క్యాట్‌ను ఆశ్రయించారు. క్యాట్ కూడా ఈ అధికారులు సొంత రాష్ట్రాల్లో రిపోర్ట్ చేయాల్సిందేనని తీర్పు ఇచ్చింది. అయితే ఈ తీర్పును కూడా తెలంగాణ హైకోర్టులో సవాల్ చేశారు. కానీ న్యాయస్థానంలో కూడా వీరికి ఊరట లభించలేదు. దీంతో ఐఏఎస్ అధికారులు వాణీప్రసాద్, వాకాటి కరుణ, రొనాల్డ్ రోస్, ఆమ్రపాలి గురువారం ఏపీలో రిపోర్ట్ చేయగా..ఈ నెలలో పదవీ విరమణ చేయనున్న మరో ఐఏఎస్ అధికారి ఎం.ప్రశాంతి బుధవారం సాయంత్రమే రిపోర్ట్ చేశారు. దీంతో త్వరలోనే ఏపీ ప్రభుత్వం వీరికి పోస్టింగ్ ఇచ్చేందుకు సిద్ధమైంది.