Pawan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేడు మంగళగిరిలోని ఇప్పటంలో పర్యటిస్తున్నారు. గుంటూరు జిల్లా ఇప్పటం గ్రామంలో రోడ్డు విస్తరణలో ఇల్లు, దుకాణాలు కోల్పోయిన వారికి పార్టీ తరపున పరిహారం అందిస్తున్నారు. ఈనెల 4వ తేదీన ఇప్పటం గ్రామంలో అధికారులు రహదారి విస్తరణ పేరిట ఇల్లు, ఇతర నిర్మాణాలను తొలగించిన సంగతి తెలిసిందే. ఇప్పటం గ్రామంలో రోడ్డు విస్తరణలో ఇళ్లను కోల్పోయిన బాధితులకు లక్ష చొప్పున పవన్ కళ్యాణ్ ఆర్ధిక సాయం అందిస్తున్నారు.
ఇప్పటంలో పర్యటనలో మాట్లాడిన జనసేనాని పవన్ వైసీపీ ప్రభుత్వంపైనా, సీఎం జగన్ మోహన్ రెడ్డి పైనా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇప్పటంలో ఇల్లు కూల్చి తన గుండెల్లో గునపం దింపారని వ్యాఖ్యానించిన పవన్.. 2024లో వైసీపీ ఎలా గెలుస్తుందో చూస్తానని సవాల్ విసిరారు. వైసీపీ నేతలను, సీఎం జగన్ ను ఉద్దేశించి పవన్.. నేను మీలాగా ఢిల్లీ వెళ్లి చాడీలు చెప్పను.. మోడీని ఎప్పుడు కలిసినా దేశ భవిష్యత్ గురించి, ప్రజల రక్షణ గురించే మాట్లాడతానని.. మీలాగా చాడీలు చెప్పే రకం కాదన్నారు.
వైసీపీని దెబ్బకొట్టాలంటే పీఎంకు చెప్పి చేయనని.. నేనే చేస్తా.. ఇక్కడ పుట్టిన వాడ్ని.. ఇక్కడే తేల్చుకుంటా.. నా యుద్ధం నేనే చేస్తా.. అని స్పష్టం చేశారు. ఇప్పుడు ఇప్పటం పర్యటనలోనే కాదు.. గత కొన్ని రోజులుగా పవన్ రాజకీయాలలో స్పీడ్ పెంచారు. వైసీపీ టార్గెట్ గా ఘాటు వ్యాఖ్యలకు దిగుతున్నారు. ప్రధాన ప్రతిపక్షం టీడీపీని మించి జనసేనాని అధికార పార్టీపై పళ్ళు నూరుతున్నారు. రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి నుండి సంక్షేమ పథకాల అమలు వరకు.. రాజధాని నుండి గ్రామ సచివాలయాలలో అవినీతి వరకు అన్నిటిని పవన్ ఎండగడుతున్నారు.
పవన్ వ్యాఖ్యలు.. పవన్ స్పీడ్ చూస్తే ఒక్కటి క్లియర్ కట్. వైసీపీ వచ్చే ఎన్నికలలో గెలవకూడదు. దాని కోసం పొత్తులకు ఒకే చెప్పడంతో పాటు అవసరమైతే ఒక మెట్టు తగ్గేందుకు కూడా సిద్ధమేనని అనౌన్స్ చేశారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఒక్కటి కూడా చీల్చేందుకు సిద్ధంగా లేనని క్లియర్ గా కనిపిస్తున్నారు. జనసేన-టీడీపీ కలిస్తే విన్నింగ్ పక్కా అనేది క్లియర్. బీజేపీ కూడా తోడైతే.. వైసీపీ ఇక ఇంటికే. అదే జోష్ ఇప్పుడు పవన్ లో కనిపిస్తుంటే.. వైసీపీ నేతలలో జనసేనాని భయం కనిపిస్తుంది. అయితే పవన్ ఒంటరిగా ఉంటే ఏ మాత్రం ప్రభావం ఉండదు కనుక.. వైసీపీ దాన్నే టార్గెట్ చేసి జనసేనను తొత్తు పార్టీగా ఎస్టాబ్లిష్ చేయాలని చూస్తుంది. దాన్ని పవన్ దూకుడుతోనే ఓవర్ టేక్ చేసుకొని ముందుకెళ్తున్నాడు.