కృష్ణానది వరద ప్రవాహం ఉదృతంగా చేరుతున్నందున ఎన్టీఆర్, కృష్ణా, పల్నాడు, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో ప్రభావిత ప్రాంత అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసినట్లు విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ తెలిపారు. ప్రకాశం బ్యారేజి రెండవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతుందని 10.5 లక్షల నుంచి 11 లక్షల క్యూసెక్కులు వరకు వరద చేరే అవకాశం ఉందన్నారు.
ఎప్పటికప్పుడు కృష్ణా వరద ప్రవాహాన్ని పర్యవేక్షిస్తూ అధికారులకు తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు జారీ చేస్తున్నట్లు వెల్లడించారు. భారీ వర్షాల ప్రభావంతో విజయవాడ బుడమేరు పొంగుతున్నందున పరిసర లోతట్టు ప్రాంత ప్రజలు వరద పూర్తి స్థాయిలో తగ్గే వరకు అప్రమత్తంగా ఉండాలన్నారు.
ఆదివారం సాయంత్రం 7 గంటల నాటికి వివిధ ప్రాజెక్టులలోని వరద ప్రవాహం క్యూసెక్కుల్లో
శ్రీశైలం డ్యామ్ వద్ద ఇన్ ఫ్లో 3.92 లక్షల క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 5.55 లక్షల క్యూసెక్కులు
నాగార్జునసాగర్ వద్ద ఇన్ ఫ్లో 4.73లక్షల క్యూసెక్కులు , ఔట్ ఫ్లో 4.89 లక్షల క్యూసెక్కులు
పులిచింతల వద్ద ఇన్ ఫ్లో 6.05లక్షల క్యూసెక్కులు , ఔట్ ఫ్లో 5.51లక్షల క్యూసెక్కులు
ప్రకాశం బ్యారేజ్ వద్ద ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 9.25 లక్షల క్యూసెక్కులు
ఉందన్నారు.
కృష్ణానదీ పరీవాహక ప్రాంత ప్రజలు, లంక గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎండి కూర్మనాథ్ కోరారు. బోట్లు, మోటర్ బోట్లు, పంట్లు, స్టీమర్లలతో నదిలో ప్రయాణించవద్దన్నారు. వాగులు, కాలువలు దాటే ప్రయత్నం చేయరాదన్నారు. వరద నీటిలో ఈతకు వెళ్ళడం, స్నానాలకు వెళ్ళడం, చేపలు పట్టడం లాంటివి చేయకూడదన్నారు. పశువులు, గొర్రెలు, మేకలు వంటి జంతువులను సురక్షిత ప్రదేశాలకు తరలించాలని సూచించారు.