Thursday, March 5, 2026
Homeఆంధ్రప్రదేశ్AP: ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఓపెన్ రిక్రూట్మెంట్ ర్యాలీ

AP: ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఓపెన్ రిక్రూట్మెంట్ ర్యాలీ

Indian Air Force recruitment: ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన యువతకు భారతీయ వాయుసేనలో చేరేందుకు ముఖ్యమైన అవకాశం లభించింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ ఓపెన్ రిక్రూట్మెంట్ ర్యాలీ మార్చి 9వ తేదీ నుంచి గుంటూరులోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ప్రాంగణంలో ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల నియామకాల భర్తీ అధికారి, సికింద్రాబాద్ 12 ఎయిర్ మెన్ సెలక్షన్ సెంటర్ కమాండింగ్ ఆఫీసర్ వింగ్ కమాండర్ షేక్ యాకూబ్ అలీ వెల్లడించారు.

- Advertisement -

ఓపెన్ రిక్రూట్మెంట్ ర్యాలీ…

రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన మహిళా, పురుష అభ్యర్థులకు ఈ ఓపెన్ రిక్రూట్మెంట్ ర్యాలీ ద్వారా భారత వాయుసేనలో చేరే అవకాశం కల్పిస్తున్నామని ఆయన తెలిపారు. దేశ సేవలో భాగస్వామ్యం కావాలనుకునే యువత ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన సూచించారు.

Also Read:https://teluguprabha.net/andhra-pradesh-news/andhra-pradesh-launches-ntr-kalyana-lakshmi-and-vidya-lakshmi-schemes/

తెలుగు రాష్ట్రాల మహిళా అభ్యర్థులకు..

షెడ్యూల్ ప్రకారం మార్చి 9, 10 తేదీల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన మహిళా అభ్యర్థులకు ర్యాలీ నిర్వహించనున్నారు. మార్చి 12 మరియు 13 తేదీల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పురుష అభ్యర్థులు హాజరు కావచ్చు. అలాగే మార్చి 15, 16 తేదీల్లో తెలంగాణ రాష్ట్ర పురుష అభ్యర్థులకు రిక్రూట్మెంట్ ర్యాలీ నిర్వహించనున్నారు.

అవివాహిత యువతీ యువకులు..

అర్హతల విషయానికి వస్తే 17 సంవత్సరాలు ఆరు నెలల నుండి 21 సంవత్సరాల మధ్య వయస్సు గల అవివాహిత యువతీ యువకులు దరఖాస్తుకు అర్హులు. అభ్యర్థులు 2 జులై 2005 నుంచి 2 జనవరి 2009 మధ్య జన్మించి ఉండాలి. కనీస ఎత్తు 152 సెంటీమీటర్లు ఉండాలి. విద్యార్హతగా ఇంటర్మీడియట్ లేదా సమానమైన పరీక్ష ఉత్తీర్ణత, మూడు సంవత్సరాల డిప్లొమా ఇంజినీరింగ్ పాలిటెక్నిక్ లేదా రెండేళ్ల వృత్తిపరమైన కోర్సు ఐటీఐ పూర్తి చేసి ఉండాలి.

50 శాతం మార్కులు సాధించి…

అభ్యర్థులు తమ విద్యార్హతల్లో మొత్తం మార్కుల్లో కనీసం 50 శాతం మార్కులు సాధించి ఉండాలి. అదేవిధంగా ఆంగ్లంలో కూడా కనీసం 50 శాతం మార్కులు ఉండటం తప్పనిసరి అని అధికారులు స్పష్టం చేశారు.

ఈ ర్యాలీకి హాజరుకావడానికి ముందస్తు ఆన్‌లైన్ నమోదు అవసరం లేదని వెల్లడించారు. అభ్యర్థులు నేరుగా ర్యాలీ వేదికకు రావచ్చు. అయితే అవసరమైన పత్రాలను తప్పనిసరిగా వెంట తెచ్చుకోవాలి. ఒరిజినల్ విద్యార్హత ధ్రువపత్రాలు లేదా డిజీలాకర్ ద్వారా ధృవీకరించిన సర్టిఫికెట్లు, డొమిసైల్ సర్టిఫికెట్, ఎన్ సి సి సర్టిఫికెట్ ఉంటే అది, ఆధార్ కార్డు, ఇటీవల తీసుకున్న పది పాస్‌పోర్టు సైజ్ కలర్ ఫోటోలు, ప్రతి ధ్రువపత్రానికి ఆరు జిరాక్స్ కాపీలు తీసుకురావాలి.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన మహిళా అభ్యర్థులు మార్చి 9న, ఆంధ్రప్రదేశ్ పురుష అభ్యర్థులు మార్చి 12న, తెలంగాణ పురుష అభ్యర్థులు మార్చి 15న ఉదయం 6 గంటల నుంచి 10 గంటల మధ్య గుంటూరులోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ప్రాంగణంలో హాజరు కావాలని సూచించారు.

భౌతిక, శారీరక ప్రమాణాల పరీక్షలు..

ఎంపిక ప్రక్రియలో భాగంగా మొదట 1.6 కిలోమీటర్ల పరుగుపోటీ నిర్వహిస్తారు. ఈ రన్నింగ్ టెస్ట్‌లో అర్హత సాధించిన వారికి భౌతిక, శారీరక ప్రమాణాల పరీక్షలు ఉంటాయి. ఈ దశలను విజయవంతంగా పూర్తి చేసిన అభ్యర్థులకు రాత పరీక్ష నిర్వహించున్నారు.

భారతీయ వాయుసేనలో …

ఈ ఓపెన్ రిక్రూట్మెంట్ ర్యాలీ ద్వారా యువతకు భారతీయ వాయుసేనలో చేరేందుకు ప్రత్యక్ష అవకాశం కల్పిస్తున్నామని వింగ్ కమాండర్ షేక్ యాకూబ్ అలీ తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్ https://agnipathvayu.cdac.in
ను సందర్శించాలని సూచించారు.

Also Read:https://teluguprabha.net/andhra-pradesh-news/ap-to-make-digital-payments-mandatory-in-liquor-shops/

దేశ రక్షణలో భాగస్వాములు కావాలనుకునే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు పిలుపునిచ్చారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News