Rain Forecast for telugu states: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడింది. ఇది త్వరలోనే తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఈ మేరకు సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ బుధవారం సాయంత్రం వివరాలు తెలిపారు. ప్రస్తుతం ఈ వాయుగుండం విశాఖపట్నానికి 400 కిలోమీటర్లు, ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు 420 కిలోమీటర్లు, పారాదీప్‌కి 500 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని అన్నారు. ప్రస్తుతం ఇది ఉత్తర వాయవ్య దిశగా కదులుతోందని తెలిపారు.
ఎప్పుడు తీరం దాటుతుంది: అక్టోబర్ 3వ తేదీ శుక్రవారం తెల్లవారుజామున గోపాల్‌పూర్- పారాదీప్ మధ్య తీరం దాటే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ అంచనా వేసింది. తీవ్ర వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.నేడు ఉత్తరాంధ్రలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. దక్షిణ కోస్తాలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు, రాయలసీమలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. బుధవారం రోజు విశాఖ, విజయనగరం, అనకాపల్లి, తూర్పుగోదావరి, కోనసీమ, పశ్చిమ గోదావరి, కాకినాడ జిల్లాల్లో ఒకటి రెండు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి.
తీర ప్రాంత హెచ్చరికలు: తీరం వెంబడి గంటకు 40 నుంచి 60 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్నందున అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు. సముద్రం అల్లకల్లోలంగా మారే అవకాశం ఉన్నందున, మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని ప్రఖర్ జైన్ సూచించారు. ఉత్తర కోస్తా జిల్లాల్లో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లడానికి సిద్ధంగా ఉండాలని ఆయన హెచ్చరించారు.


