Indrakeeladri Devi Navaratri 2025: దేశ వ్యాప్తంగా శరన్నవరాత్రులు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. శరన్నవరాత్రి వేడుకలను ఘనంగా జరిపేందుకు భక్తులు సిద్ధమవుతున్నారు. దేవీ నవరాత్రుల సందర్భంగా 9 రోజుల పాటు అమ్మవారి ఆలయాల్లో, మండపాల్లో, ఇంట్లో పూజ గదిలో అమ్మవారిని అత్యంత భక్తిశ్రద్దలతో పూజిస్తారు. సెప్టెంబర్ 22 (సోమవారం) నుంచి దసరా శరన్నవరాత్రులు ప్రారంభం కానున్న నేపధ్యంలో విజయవాడలో కొలువు దీరిన ఇంద్ర కీలాద్రి ఆలయం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. అయితే, ఈ ఏడాది నవరాత్రులు 9 రోజులు కాకుండా.. 10 రోజుల పాటు జరగనున్నాయి. ఈ నేపధ్యంలో విజయదశమితో కలిపి మొత్తం 11 రోజుల పాటు దసరా నవరాత్రి ఉత్సవాలు జరుపుకోనున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రముఖ పుణ్య క్షేత్రం ఇంద్రకీలాద్రి కూడా దసరా ఉత్సవాలకు అందంగా ముస్తాబైంది. సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 వరకు దేవీ నవరాత్రలు వైభవంగా జరగనున్నాయి. 11 రోజుల పాటు కనక దుర్గ 11 అలంకారాలలో భక్తులకు దర్శనమివ్వనున్నట్లు దుర్గగుడి ఈవో శినా నాయక్ వెల్లడించారు. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఏ రోజు ఏ అలంకరణ ఉంటుందనే దానికి సంబంధించిన పూర్తి షెడ్యూల్ చూద్దాం.
అమ్మవారి అలంకరణల షెడ్యుల్ ఇదే..
సెప్టెంబర్ 22 నవరాత్రి మొదటి రోజు: బాలత్రిపుర సుందరి దేవి
సెప్టెంబర్ 23 నవరాత్రి రెండవ రోజు: గాయత్రీ దేవి
సెప్టెంబర్ 24 నవరాత్రి మూడవ రోజు: అన్నపూర్ణాదేవి
సెప్టెంబర్ 25 నవరాత్రి నాలుగవ రోజు: కాత్యాయని దేవి
సెప్టెంబర్ 26 నవరాత్రి ఐదో రోజు: మహాలక్ష్మి దేవి
సెప్టెంబర్ 27 నవరాత్రి ఆరో రోజు: లలితా త్రిపుర సుందరి దేవి
సెప్టెంబర్ 28 నవరాత్రి ఏడో రోజు: మహాచండి దేవి
సెప్టెంబర్ 29 నవరాత్రి ఎనిమిదో రోజు: సరస్వతి దేవి
సెప్టెంబర్ 30 నవరాత్రి తొమ్మిదో రోజు: దుర్గాదేవి
అక్టోబర్ 1 నవరాత్రి 10వ రోజు: మహిషాసురమర్దిని దేవి
అక్టోబర్ 2 వ తేదీ విజయ దశమి : రాజరాజేశ్వరి దేవి
సీఎం దంపతుల మీదుగా పట్టు వస్త్రాలు..
ఈ దసరా ఉత్సవాలు అక్టోబర్ 2 ఉదయం 9:30 గంటలకు పూర్ణాహుతితో ముగియనున్నాయి. అదే రోజు సాయంత్రం 5 గంటలకు కృష్ణా నదిలో హంసవాహన తెప్పోత్సవం జరుగుతుంది. సెప్టెంబర్ 29న అమ్మవారి నక్షత్రం అయిన మూలనక్షత్రం రోజున మధ్యాహ్నం 3:30 నుంచి 4:30 మధ్య సీఎం చంద్రబాబు దంపతులు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. దసరా ఉత్సవాల్లో అమ్మవారిని దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాదు దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి కూడా భక్తులు తరలి వస్తారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఎటువంటి ఇబ్బంది కలుగకుండా ఏర్పాటు చేసినట్లు ఆలయ అధికారులు చెప్పారు. భక్తుల సౌకర్యార్థం ఆలయ ప్రాంగణంలో అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. మరోవైపు, పుష్కరిణిలో తెపోత్సవాన్ని సైతం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.


