TDP-BJP: టీడీపీ అధినేత చంద్రబాబు జాతీయ స్థాయిలో మళ్లీ చక్రం తిప్పేందుకు రాజకీయ వాతావరణం అనుకూలంగా మారుతోందా? అంటే.. తాజా పరిణామాలను గమనిస్తే.. అవుననే సమాధానం రాక తప్పదు. మొన్నా మధ్య ‘ఆజాదీకా అమృత్ మహోత్సవ్’ విషయమై చర్చించేందుకు చంద్రబాబుకు ఢిల్లీ నుంచి ఆహ్వానం అందింది. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ జరిగిన ఆ సమావేశం సందర్భంగా చంద్రబాబు నాయుడి చేయి పట్టుకుని మరీ ప్రధాని మోడీ ఐదు నిమిషాలు ప్రత్యేకంగా మాట్లాడడం రాజకీయంగా ఆయనకున్న ప్రాముఖ్యతను ఎత్తి చూపింది. 2019 ఎన్నికల తర్వాత మోడీ-బాబు కలుసుకోవడంపై అదే మొదటిసారి కావడంతో ఆ ప్రత్యేక భేటీ రాజకీయంగా అప్పట్లో ఆసక్తికర చర్చకు తెర రేపింది.
తాజాగా.. ఇప్పుడు మరోసారి ఢిల్లీ పెద్దల నుంచి చంద్రబాబు ఆహ్వానం వచ్చింది. ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగే రాజకీయ పార్టీల అధ్యక్షుల సమావేశానికి హాజరవ్వాలని చంద్రబాబును కేంద్రం కోరింది. వచ్చే నెల 5వ తేదీన సాయంత్రం 5 గంటలకు రాష్ట్రపతి భవన్ లో ఈ సమావేశం జరుగుతుంది. జీ20 దేశాల కూటమికి వచ్చే నెల1వ తేదీ నుంచి 2023 నవంబర్ 30 తేదీ వరకూ భారతదేశం అధ్యక్షత వహించనుంది. ఈ క్రమంలో భారత్ లో నిర్వహించే జీ10 భాగస్వామ్య దేశాల సమావేశాలపై దేశంలోని రాజకీయ పార్టీల అధ్యక్షులతో చర్చించి, వారి నుంచి సూచనలు, సలహాలూ తీసుకోవాలని ప్రధాని మోడీ నిర్ణయించారు. అందుకోసమే ఈ సమావేశం ఏర్పాటు చేశారు.
రాష్ట్రపతి భవన్ లో వచ్చే నెల 5న జరిగే ఈ సమావేశానికి హాజరు కావాలంటూ పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి చంద్రబాబుకు ఆహ్వానం పంపడం గమనార్హం. కేంద్రప్రభుత్వ ఆహ్వానం మేరకు ఈ సమావేశంలో పాల్గొనేందుకు చంద్రబాబు నాయుడు మరోసారి డిసెంబర్ 5న ఢిల్లీ వెళ్తారు. అయితే.. చంద్రబాబుకు కేంద్రం నుంచి తరచుగా ఆహ్వానాలు వస్తుండడం తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠ రేపుతోంది. నాలుగు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ అనుభవంతో పాటు.. రాజకీయ వ్యూహాలలో అపర చాణక్యుడిగా పేరు పొందిన చంద్రబాబు అవసరాన్ని మోడీ గుర్తించారని అంటున్నారు.
అదీ కాక ఏపీలో ఎలాగైనా తన ఉనికిని ప్రదర్శించాలని ఎన్నాళ్లుగానో వేచి చూస్తున్న బీజేపీకి ఇప్పుడు చంద్రబాబుతోనే అది సాధ్యం అవుతుందనే వాస్తవం బోధపడి ఉంటుందని, అందుకే బాబుతో చెలిమి కోసం, కమలం పార్టీ పెద్దలు యత్నాలు చేస్తున్నారని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఏపీలో వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వకుండా చేస్తానంటూ బీజేపీకి మిత్రపక్షంగా ఉన్న జనసేన పార్టీ చీఫ్ పవన్ ఇప్పటికే ప్రకటించారు. అయితే.. అది కేవలం జనసేన-బీజేపీ పార్టీల మైత్రితో మాత్రమే సాద్యం కాదనే తత్వం బీజేపీ పెద్దలకు బోధపడిందని, చంద్రబాబు సహకారం కూడా ఉంటేనే ఏపీలో వైసీపీని గద్దె దివంచడం సాధ్యమౌతుందన్న నిర్ణయానికి మోడీ-షా ద్వయం వచ్చేసినట్లు కనిపిస్తోదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
మరో పక్కన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన టీఆర్ఎస్ పార్టీని జాతీయ స్థాయి పార్టీగా మారుస్తూ.. బీఆర్ఎస్ ను ప్రకటించి ఒక విధంగా మోడీపై యుద్ధమే ప్రకటించారు. పక్క తెలుగు రాష్ట్రం ఏపీలో కూడా బీఆర్ఎస్ విస్తరించే వ్యూహాలతో తెలంగాణ సీఎం కేసీఆర్ అడుగులు వేస్తున్నారు. కేసీఆర్ దూకుడుకు చెక్ పెట్టాలంటే చంద్రబాబు తోడ్పాటు కూడా అవసరం అని ఢిల్లీ పెద్దలు గుర్తించారంటున్నారు. దాంతో పాటు.. తెలంగాణలో ఎలాగైనా అధికార పీఠం ఎక్కాలని తహతహలాడుతున్న కమలం పార్టీ అక్కడ గట్టెక్కాలంటే సొంత బలం సరిపోదని మునుగోడు ఉప ఎన్నిక ఫలితం తేల్చేసింది.
అందుకే తెలంగాణలో పరిస్థితుల కారణంగా నష్టపోయినా ఇప్పటికీ పటిష్టమైన కేడర్ ఉన్న టీడీపీని, చంద్రబాబును ప్రసన్నం చేసుకుంటే.. రాష్ట్రంలో అధికారం తమకు దక్కుతుందన్న భావన బీజేపీ పెద్దల్లో ఉందని తెలుస్తోంది. గతంలోనే కేంద్రంలో నేషనల్ ఫ్రంట్ కన్వీనర్ గా చక్రం తిప్పిన అనుభవం చంద్రబాబుకు ఉంది. ఇప్పుడు ఇరు తెలుగు రాష్ట్రాల్లో చంద్రబాబు మద్దతుతో పాటు.. కేంద్ర రాజకీయాల్లోనూ ఆయన గత అనుభవాన్ని ఉపయోగించుకోవాలని మోడీ భావిస్తున్నట్లు చెబుతున్నారు.అందుకే ఇంత కాలం లేనిది ఇటీవలి కాలంలో చంద్రబాబుకు కేంద్రం నుంచి వరుస ఆహ్వానాలు వస్తున్నాయంటున్నారు.