Saturday, November 15, 2025
Homeఆంధ్రప్రదేశ్Geetham University: ఏఐ’తో భవిష్యత్తులో అపార అవకాశాలు.. గీతం సదస్సులో నిపుణుల వెల్లడి

Geetham University: ఏఐ’తో భవిష్యత్తులో అపార అవకాశాలు.. గీతం సదస్సులో నిపుణుల వెల్లడి

IPA Conference in Geetham University about Artificial Intelligence: కృత్రిమ మేథ (ఏఐ)తో ఔషధ రంగంలో అనేక అవకాశాలు లభించనున్నాయని, ముఖ్యంగా నూతన ఔషధాల తయారీ నుంచి వాటి నాణ్యతా ప్రమాణాల్ని పరీక్షించే దశ వరకు ఏఐ నిపుణులు పెద్ద ఎత్తున అవసరమవుతారని గీతం యూనివర్శిటీ వేదికగా ఇండియన్‌ ఫార్మస్యూటికల్‌ అసోసియేషన్‌ (ఐపీఏ) నిర్వహించిన సదస్సులో పారిశ్రామిక నిపుణులు స్పష్టం చేశారు. సదస్సుకు సైన్స్‌ డీన్‌ డాక్టర్‌ ఎస్‌ అనంత రామకృష్ణ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కార్యక్రమానికి గీతం స్కూల్‌ ఆఫ్‌ ఫార్మసీ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ ఎన్‌ శ్రీనివాస్‌ అధ్యక్షత వహించారు. ఆయన మాట్లాడుతూ.. నూతన ఔషధాల తయారీకి గతంలో 10 నుంచి 20 ఏళ్ల సమయం పట్టేదని, కోవిడ్‌ తర్వాత ఏఐ సాయంతో కేవలం మూడేళ్లలోపే ఔషధాల తయారీ సాధ్యపడుతోందన్నారు. నిజాం ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ క్లినికల్‌ ఫార్మకాలజీ విభాగాధిపతి డాక్టర్‌ సి.ప్రభాకరరెడ్డి మాట్లాడుతూ.. ఏఐని ఉపయోగించి రానున్న రోజుల్లో క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులకు సైతం టీకాల్ని తయారు చేయవచ్చని తెలిపారు. అనంతరం, వ్యాక్సిన్‌ల తయారీలో వివిధ దశల్ని ఆయన విద్యార్థులకు వివరించారు.

- Advertisement -

ఏఐపై యువత అవగాహన పెంచుకోవాలి..

యామ్నెల్‌ ఫార్మస్యూటికల్స్‌ ఉపాధ్యక్షుడు డాక్టర్‌ శ్రీధర్‌ మాట్లాడుతూ.. ఏఐతో ప్రతి ఒక్కరికీ వారి శరీర తత్వాన్ని బట్టి ఔషధాలతో చికిత్స చేయవచ్చన్నారు. ఇతర రంగాల మాదిరి కృత్రిమ మేథ కారణంగా ఔషధ రంగంలో ఉద్యోగాలు కోల్పోవడం ఉండదని, కొత్త అవకాశాలు సృష్టించడం జరుగుతుందన్నారు. క్లీనోసోల్‌ సంస్థ వ్యవస్థాపకుడు డాక్టర్‌ ముజిబుద్దీన్‌ షేక్‌ మాట్లాడుతూ.. ఏఐతో పాటు క్లీనికల్‌ డేటా సైన్స్‌ నిపుణుల అవసరం కూడా ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతోందన్నారు. ఫార్మసీ విద్యార్థులకు కృత్రిమ మేధా అంశాలపై శిక్షణ ఇస్తున్నామన్నారు. ఆర్కోల్యాబ్స్‌ నిపుణుడు డాక్టర్‌ శివకార్తిక్‌ మాట్లాడుతూ.. వైద్య ఆరోగ్య రంగంలో భద్రతా ప్రమాణాలు పాటించడం అత్యంత కీలకమని, దీనికి గాను కృత్రిమ మేథ, మిషన్‌ లెర్నింగ్‌, క్వాంటమ్‌ ఎనలిటిక్స్‌ వంటి టూల్స్‌ ఎంతగానో ఉపయోగపడుతున్నాయని తెలిపారు.

ఏఐతో ఫార్మా రంగంలో అవకాశాలు మెండు..

శాండోజ్‌ సంస్థ ఔషధ భద్రత అధికారి డాక్టర్‌ శ్రద్దాభంగే మాట్లాడుతూ.. ఔషధాల నాణ్యతను గుర్తించడంలో ఫార్మకో విజిలెన్స్‌ కీలక పాత్ర పోషిస్తోందన్నారు. ఈ నైపుణ్యాలపై అవగాహన పెంచుకుంటే ప్రపంచ వ్యాప్తంగా అవకాశాలు లభిస్తాయన్నారు. గ్లెన్‌మార్క్‌ ఫార్మాస్యూటికల్స్‌ ఉపాధ్యక్షుడు డాక్టర్‌ రాజేంద్రకాశీ మాట్లాడుతూ.. ఔషధాల వినియోగంలో సమస్యలు ఎదురైనప్పుడు వాటి నాణ్యతను గుర్తించడంలో ఫార్మకో విజిలెన్స్‌ ఎంతగానో ఉపయోగపడుతుందని, దీనికి కృత్రిమ మేథ పరిజ్ఞానం తోడైతే తక్కువ సమయంలో అద్భుతమైన ఫలితాలు సాధించవచ్చని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో గీతం కెరీర్‌ గైడెన్స్‌ సెంటర్‌ డైరక్టర్‌ డాక్టర్‌ ఉమాదేవి, సీనియర్‌ మేనేజర్‌ ప్రభ, రాజమహంతి, సీనియర్‌ ప్రొఫెసర్లు, ఫార్మసీ విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad