ఏపీలో సంచలనం సృష్టించిన ముంబై నటి కాదంబరీ జెత్వానీ(Actress Jethwani) కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఇప్పటికే సస్పెండ్ అయిన ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారుల సస్పెన్షన్‌ను ప్రభుత్వం మరో ఆరు నెలలు పొడిగించింది. ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పీఎస్‌ఆర్ ఆంజనేయులు (PSR Anjaneyulu), విజయవాడ మాజీ సీపీ కాంతిరాణా తాతా (Kanti Rana), ఐపీఎస్ అధికారి విశాల్ గున్నిని గతంలో సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. నేటితో ఆ గడువు ముగియడంతో సెప్టెంబరు 25 వరకు పొడిగిస్తున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.
కాగా ఓ కేసులో నటి జెత్వానీని అరెస్టు చేసి, ఇబ్బందులకు గురిచేసిన వ్యవహారంలో ఈ ముగ్గురి అధికారులపై పలు అభియోగాలున్నాయి. అఖిలభారత సర్వీసు నిబంధనలు ఉల్లంఘించారన్న అభియోగాలపై వీరిని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఇదిలా ఉంటే జెత్వానీని అక్రమంగా నిర్బంధించి అరెస్టు చేశారనే ఆరోపణలతో ఐపీఎస్ అధికారులు కాంతి రాణా, విశాల్ గున్ని, ఏసీపీ హనుమంత రావు, సీఐ సత్యనారాయణ, అడ్వకేట్ వెంకటేశ్వర్లుపై సీఐడీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఈ కేసులో తమను అరెస్ట్ చేయకుండా నిందితులు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని హైకోర్టును ఆశ్రయించారు. దీంతో హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.