YS Jagan: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా లేదా అని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ‘ఛలో మెడికల్ కాలేజీ’ కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి ప్రభుత్వం చేసిన ప్రయత్నాలను ఆయన తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపే హక్కును కాలరాస్తున్నారని ఎక్స్ (గతంలో ట్విట్టర్) వేదికగా ప్రశ్నించారు.
వైఎస్ జగన్ తన ఎక్స్ పోస్ట్‌లో నేరుగా చంద్రబాబును ఉద్దేశించి, ప్రజారోగ్య రంగాన్ని, పేదల ఆరోగ్య భద్రతను కాపాడటానికి, ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్సార్‌సీపీ యూత్, స్టూడెంట్ విభాగాలు చేపట్టిన శాంతియుత ఆందోళనలను ఎందుకు అడ్డుకున్నారని నిలదీశారు.
“లాఠీచార్జీలు ఎందుకు చేశారు? గృహనిర్బంధాలు, అరెస్టులు ఎందుకు చేశారు?” అని వైఎస్ జగన్ ప్రశ్నించారు. “మీరు స్కాములు చేస్తూ ప్రజల ఆస్తులైన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను మీ అనుచరులకు అమ్ముతుంటే, వాటిని ప్రశ్నించకూడదా? ప్రజల పక్షాన గొంతెత్తితే అణచివేస్తారా?” అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ నిరసనను అడ్డుకోవడంలో ప్రభుత్వం ఎంతగా తెగించిందో వివరిస్తూ, అసెంబ్లీ వెలుపల కూడా తమ పార్టీ ఎమ్మెల్సీలు నిరసన తెలిపితే, పోలీసులు దౌర్జన్యం చేశారని జగన్ ఆరోపించారు. అంతేకాకుండా, ఈ ఘటనలను కవర్ చేయడానికి వెళ్ళిన మీడియా ప్రతినిధులపై కూడా దాడులకు దిగడంపై ఆయన “ఇదేం రాక్షసత్వం?” అంటూ మండిపడ్డారు.
అయితే, ప్రభుత్వ అణచివేతకు భయపడకుండా వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, నాయకులు ధైర్యంగా నిలబడ్డారని జగన్ ప్రశంసించారు. శాసన మండలిలోనూ, మెడికల్ కాలేజీల వద్ద కూడా విజయవంతంగా ఆందోళనలు నిర్వహించారని తెలిపారు. ఈ పోరాటంలో పాల్గొన్న యువతీ యువకులు, విద్యార్థులను ఆయన అభినందించారు.
“పేదల ఆరోగ్య భద్రత, పేద విద్యార్థుల ప్రయోజనాలను కాపాడటానికి, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకునేంతవరకూ మా పోరాటాలు మరింత ఉద్ధృతంగా కొనసాగుతాయి” అని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. ఈ ప్రకటనతో మునసలి సర్కార్, ప్రజల మధ్య పోరాటం మరింత ముదురుతుందని తెలుస్తోంది. ఈ వ్యవహారం రానున్న రోజుల్లో రాష్ట్ర రాజకీయాలను మరింత ప్రభావితం చేయొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.


