భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్(షార్) నుంచి తాజాగా ప్రయోగించిన PSLV C-60 రాకెట్ ప్రయోగం విజయవంతమైన సంగతి తెలిసిందే. దీంతో అగ్రదేశాల సరసన భారత్ చేరింది. ఇప్పటివరకు ఇస్రో చేపట్టిన ప్రధానమైన ప్రయోగాల్లో స్పేడెక్స్ కూడా ఒకటి. పీఎస్‌ఎల్‌వీ 420 కిలోల బరువుగల స్పేడెక్స్ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన జంట ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలో ప్రవేశ పెట్టింది. ఈ రెండు చిన్న ఉపగ్రహాలను ఉపయోగించి అంతరిక్షంలో డాకింగ్ సాంకేతికతను ప్రదర్శించడమే ఈ మిషన్ లక్ష్యంగా శాస్త్రవేత్తలు తెలిపారు.
కాగా ఈ ప్రయోగం విజయవంతం కావడంతో పీఎస్‌ఎల్‌వీ-సీ60 ప్రయోగం ద్వారా స్పేస్ డాకింగ్ సాంకేతికతను భారత్ సొంతం చేసుకుందని ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ తెలిపారు. ఉమ్మడి మిషన్ లక్ష్యాలు సాధించడానికి.. బహుళ రాకెట్ ప్రయోగాలు అవసరమైనప్పుడు అంతరిక్షంలో డాకింగ్ సాంకేతికత చాలా అవసరమన్నారు. ఈ సాంకేతికత రష్యా, చైనా, అమెరికాలకు ఇప్పటికే ఉందని.. చంద్రయాన్-4, భారతీయ అంతరిక్ష స్టేషన్ నిర్మాణం, నిర్వహణకు, భారత అంతరిక్ష ఆశయాలకు ఈ టెక్నాలజీ ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.