ISRO CMS-03 launch: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో మైలురాయిని అధిగమించింది. దేశ రక్షణ, కమ్యూనికేషన్ రంగంలో సరికొత్త శకానికి నాంది పలుకుతూ, అత్యంత బరువైన సమాచార ఉపగ్రహం సీఎంఎస్-03 (CMS-03) ను విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది.
రికార్డు సృష్టించిన ‘ఎల్‌వీఎం3-ఎం5’
ఆదివారం సాయంత్రం 5:26 నిమిషాలకు శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి ‘ఎల్‌వీఎం3-ఎం5’ (LVM3-M5) వాహక నౌక నింగిలోకి దూసుకెళ్లింది. దీనిని ఇస్రో ‘బాహుబలి’ రాకెట్‌గా పిలుస్తుంది. ఈ ప్రయోగంలో, 4,410 కిలోల బరువున్న సీఎంఎస్-03 ఉపగ్రహాన్ని జియో సింక్రోనస్ ట్రాన్స్‌ఫర్ ఆర్బిట్ (GTO) లోకి శాస్త్రవేత్తలు అత్యంత కచ్చితత్వంతో ప్రవేశపెట్టారు. భారత భూభాగం నుంచి స్వదేశీ రాకెట్ ద్వారా GTO కక్ష్యలోకి ప్రయోగించిన శాటిలైట్లన్నింటిలోకీ ఇదే అత్యంత బరువైనది కావడం ఈ ప్రయోగం ప్రత్యేకత. .
ఆత్మనిర్భర్ భారత్ దిశగా కీలక అడుగు
ప్రయోగం విజయవంతం అయినట్లు ఇస్రో ఛైర్మన్ నారాయణన్ ప్రకటించారు. “సీఎంఎస్-03 విజయవంతం కావడం భారత్‌కు మరో ఘనత. ఇందులో కీలకపాత్ర పోషించిన శాస్త్రవేత్తలు, సిబ్బంది కృషి వల్లే ఇదంతా సాధ్యమైంది. ఆత్మనిర్భర్ భారత్ దిశగా ఇస్రో మరో పటిష్టమైన అడుగు వేసింది” అని ఆయన అభినందించారు.
నౌకాదళానికి భద్రమైన కమ్యూనికేషన్ కవచం
సీఎంఎస్-03 ఉపగ్రహం దీనిని జీశాట్-7ఆర్ అని కూడా పిలుస్తారు. దేశ భద్రత, సమాచార వ్యవస్థను మరింత మెరుగుపరుస్తుంది. దీని ప్రధాన లక్ష్యం భారత నౌకాదళం అవసరాలను తీర్చడం. సాగర జలాల్లో మోహరించిన మన యుద్ధనౌకలు, జలాంతర్గాములు, భూ నియంత్రణ కేంద్రాల మధ్య భద్రమైన, నిరంతర కమ్యూనికేషన్లు సాగించేందుకు ఈ శాటిలైట్ తోడ్పడుతుంది. ఇది భారత తీరం నుంచి 2,000 కిలోమీటర్ల దూరం వరకూ విస్తరించిన సాగర జలాల్లో సేవలు అందించగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. 2013 నుంచి సేవలు అందిస్తున్న జీశాట్-7 ఉపగ్రహం స్థానంలో ఈ కొత్త ఉపగ్రహాన్ని ప్రయోగించారు, ఇది అత్యాధునిక సాంకేతికతతో మరింత మెరుగైన కమ్యూనికేషన్ సేవలను అందిస్తుంది.ఈ ప్రయోగం విజయవంతం కావడంతో, ఇస్రో అంతరిక్ష రంగంలో తన అగ్రస్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంది.


