IT Companies coming to Vizag: విశాఖ సిటీకీ ఐటీ కంపెనీలు క్యూ కడుతున్నాయి. చంద్రబాబు ప్రభుత్వం విశాఖను హైదరాబాద్‌కు ధీటుగా ఐటీ హబ్‌గా మారుస్తామని పదే పదే చెబుతోంది. ఇందులో భాగంగానే పెద్ద ఎత్తున విశాఖకు పెట్టుబడులు తీసుకొచ్చేందుకు ఐటీ మంత్రి నారా లోకేష్ ఐటీ ప్రతినిధులను కలుస్తున్నారు. విశాఖలో పెట్టుబడులు పెట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇన్వెస్టర్లకు ఏపీ ప్రభుత్వం ఇచ్చే రాయితీలు, సదుపాయాల గురించి వివరిస్తున్నారు. ఈ చొరవతో చాలా కంపెనీలు విశాఖలో తమ కార్యకలాపాలను ప్రారంభించేందుకు ఆసక్తి కనబరుస్తున్నాయి. ఇప్పటికే గూగుల్ సంస్థ విశాఖకు రావడం, మరోవైపు సముద్రం ఉండడంతో ఎక్కువగా ఐటీ కంపెనీలు విశాఖపై ఫోకస్ చేశాయి. ప్రభుత్వం కూడా వెంట వెంటనే అనుమతులు మంజూరు చేస్తోండటం కలిసివస్తోంది.
విశాఖకు ఐటీ కంపెనీలు రాక..
విశాఖ సిటీలోని కాపులుప్పాడ ప్రాంతానికి త్వరలోనే మరో ఐటీ కంపెనీ రానుంది. ఆ కంపెనీకి ప్రభుత్వం అన్ని అనుమతులిచ్చింది. క్వార్క్స్ టెక్నోసాఫ్ట్ లిమిటెడ్ అనే కంపెనీకి ప్రభుత్వం అన్ని అనుమతులు మంజూరు చేసింది. దాదాపు రూ. 115 కోట్లతో ఐటీ కంపెనీని నిర్మించనుంది. ఈ కంపెనీ ద్వారా దాదాపు 2 వేల ఉద్యోగాలు రానున్నాయి. ముఖ్యంగా అడ్వాన్స్‌డ్ డిజిటల్ ఇంజినీరింగ్, ఏఐఎంఎల్, క్లౌడ్, సైబర్ సెక్యూరిటీ వంటి ఆధునిక విభాగాలను ఆ క్యాంపస్‌లో ఉండనున్నాయి. ఎకరం కోటి చొప్పున మొత్తం 4 ఎకరాలు భూమి ఆ సంస్థకు ప్రభుత్వం కేటాయించింది. రెండేళ్లలో తొలి దశ కార్యకలాపాలు ప్రారంభించనుంది. ప్రాజెక్టును ఐదేళ్లలో పూర్తి చేయాలని ఆదేశాల్లో ప్రస్తావించింది. ఏపీ ఐటీ అండ్ జీసీసీ పాలసీ 4.0 ప్రకారం ప్రోత్సాహకాలు ఇస్తున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు ఐటీ ఎలక్ట్రానిక్స్ విభాగం కార్యదర్శి కాటమనేని భాస్కర్ ఉత్తర్వులు జారీ చేశారు.
వివిధ సంస్థలకు భూముల కేటాయింపు..
ప్రాజెక్టు నిర్మాణం-నిర్వహణకు సంబంధించి స్పష్టమైన మార్గదర్శకాలు విడుదల చేసింది కూటమి ప్రభుత్వం. ఈ ప్రాజెక్టు అమలులో ఏపీటీఎస్, ఏపీఐఐసీ మేనేజింగ్ డైరెక్టర్లకు అవసరమైన చర్యలు తీసుకోవాలని పేర్కొంది. ఈ మధ్యకాలంలో అతి వేగంగా అనుమతులు ఇచ్చిన ప్రభుత్వాలను చూడలేదని ఐటీ ప్రతినిధులు కూటమి ప్రభుత్వాన్ని కొనియాడుతున్నారు. ఈ సంస్థకే కాదు చాలా కంపెనీలు విశాఖ తీరానికి రానున్నాయి. ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో ఐటీ కంపెనీలకు భూముల కేటాయింపుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రహేజా కార్ప్‌కు 27 ఎకరాలు ఇవ్వనుంది. దాదాపు రూ. 2,172 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. ఫ్లూయెంట్‌గ్రిడ్ సంస్థ రూ. 150 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. మదర్సన్ నెక్స్ట్ టెక్ కంపెనీ రూ.109 కోట్లు, ఐస్పేస్ సాఫ్ట్‌వేర్ కంపెనీ రూ. 119 కోట్ల మేర పెట్టుబడులు పెట్టనున్నాయి. దీంతో, త్వరలోనే విశాఖ ఐటీకి కేరాఫ్‌గా మారనుంది.


