- కూటమి అభ్యర్థుల విజయానికి సమిష్టి కృషి చేయాలి
- ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ పిలుపును
- ఏలేశ్వరం పట్టణ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం
శంఖవరం(తెలుగుప్రభ) ; ఏ ఎన్నికలైనా, ఏ పార్టీయైనా సరే ఆశించిన అందరు అభ్యర్థులకూ ప్రజాస్వామ్య ప్రజాప్రాతినిధ్య పదవుల సీట్లను ఇవ్వలేం. ఒక్క పదవీ సీటుని ఒక్క అభ్యర్ధికి మాత్రమే ఇవ్వగలమని ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ స్పష్టం చేశారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం నగర పంచాయతీ పరిధిలోని ఎన్.కన్వెన్షన్లో కార్యకర్తే అధినేత పేరుతో పట్టణ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశాన్ని గురువారం నిర్వహించారు.
ఈ కార్యక్రమ ముఖ్య అతిథిగా పాల్గొన్న శాసన సభ్యురాలు వరుపుల సత్యప్రభ సభికులను ఉద్దేశించి ప్రసంగించారు. ఛైర్మన్ పదవి ఒక్కరికి అవకాశం మాత్రమే వస్తుంది. అలాగే వార్డుల్లో కూడా ఒక్కో వార్డుకు ఒక్కో వార్డు సభ్యుడు పదవి మాత్రమే లభిస్తుంది. సీట్లు ఇచ్చేటప్పుడు గెలుపు భద్రత కోసం చిన్న సర్దుబాట్లు, చిన్న చిన్న మార్పులు చేసుకోవలసి వస్తుంది. సీట్లిచ్చే విషయంలో అందరికీ సమాన న్యాయం చేయలేం. అలా అని అందరికీ సీట్లు ఇవ్వలేక పోయినా పార్టీకి కార్యకర్తలు అందరూ సమానమే. పార్టీ విజయానికి కష్టపడి పనిచేసిన కార్యకర్తలు అందరినీ పార్టీ ముందుకు తీసుకు వెళ్ళగలదు. మిగతా అర్హుల్లో ఒకరు ఎక్కువ, ఇంకొకరు తక్కువని కాదు. సీటు ఒక్కరికే అన్నది, ఇంకా కూటమి నియమాన్ని మీరు అర్ధం చేసుకోవాలని ఎమ్మెల్యే సత్యప్రభ సర్ది చెప్పారు.
ఛైర్మన్, వార్డు సభ్యుల అభ్యర్థుల ఎంపికలో మీ అందరి అభిప్రాయాలనూ తీసుకుంటాం. నియోజకవర్గ కమిటీ తోపాటు జిల్లా కమిటీలో కూడా నిర్ణయం తీసుకుంటారు. మనం కూటమిలో ఉన్నాం కాబట్టి అభ్యర్ధుల ఖరారు విషయంలో పార్టీ అధిష్టానం నుంచి విధి విధానాలు కూడా ఇంకా వెలువడాల్సి ఉంది. కూటమి పార్టీల నుంచి కూడా అభ్యర్థుల ఎంపీక విధివిధానాలు ఖరారు కావలసి ఉంది. ఏలేశ్వరం పురపాలక సంఘం అధ్యక్ష్య పదవికి అర్హుల పేర్ల ప్రతిపాదిత జాబితాను ఇప్పటికే పార్టీ అధిష్టానానికి పంపించాం. ఇవన్నీ కూడా పరిగణన లోనికి తీసుకొని అభ్యర్థులను త్వరలోనే పార్టీ ప్రకటిస్తుందని ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ పేర్కొన్నారు. తెలుగు దేశం పార్టీ ప్రతీ కార్యకర్తా కూడా ప్రజలతో నిరంతరం మమేకమౌతూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ ఉండాలని సూచించారు.
ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని అందరూ సమష్టిగా కృషి చేసి, కూటమి అభ్యర్థి విజయానికి తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని సత్యప్రభ పిలుపు నిచ్చారు. మనం చాలా నమ్మకంగా, ధైర్యంగా ఉన్నాం. ఈ రెండున్నర సంవత్సరాల్లో ఏలేశ్వరం నగర పంచాయతీలో ఒక పక్క అభివృద్ధిని, మరో పక్క సంక్షేమ ఫధకాలనూ ఒక చోట ఎక్కువ, మరొక చోట తక్కువ అని కాకుండా అన్ని వార్డుల్లోనూ సమానంగా అమలు చేసాం. పధకాల లబ్ది పంపిణీలో ఎక్కడా కూడా పార్టీల వివక్షను చూపలేదు. కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధిని మీరందరూ చూసారు. ఈ అభివృద్ధిని మీరంతా స్ఫూర్తిగా తీసుకుని ప్రజల్లోకి తీసుకు వెళ్ళాలి. రాబోయే ఏలేశ్వరం పురపాలక సంఘం ఎన్నికల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ విధిగా సమిష్టిగా సమన్వయంతో పనిచేసి కూటమి అభ్యర్థి విజయానికి కృషి చేయాలని ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ పిలుపును ఇచ్చారు. ఈ సమావేశంలో పట్టణ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

