ఫ్యామిలీ డాక్టర్ సేవల్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభించారు. ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రాం (ప్రివెంటివ్ కేర్) దేశానికే రోల్ మోడల్‌గా ఉంటుందన్నారు జగన్. పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం లింగంగుంట్ల గ్రామంలో లాంఛనంగా ప్రారంభించారు. గతంలోలా వైద్యం కోసం డాక్టర్ల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా మీ ఊరిలోనే మీ వద్దనే ఉచిత వైద్యం అందించేలా, దేశంలో ఎక్కడా లేని విధంగా ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రాం ద్వారా అందరికీ మంచి ఆధునిక వైద్యం, అదీ ఉచితంగా, అందరికీ తాము ఉంటున్న ఊర్లోనే అందించే కార్యక్రమమంటూ జగన్ సర్కారు ప్రతిష్ఠాత్మకంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతోంది. మంచానికే పరిమితమైన రోగులకు సైతం వారి గ్రామంలోనే, వారి గడప వద్దనే అవసరమైన వైద్యం అందజేయాలన్న తపనతో ఫ్యామిలీ డాక్టర్ విధానానికి శ్రీకారం చుట్టింది జగన్ ప్రభుత్వం.
ప్రతి మండలానికి కనీసం రెండు పీహెచ్‌సీలు, ప్రతి పీహెచ్‌సీలో ఇద్దరు డాక్టర్లు, ఒక 104 వాహనంతో అనుసంధానం, ఒక డాక్టర్ పీహెచ్‌సీలో ఉంటే మరో డాక్టర్ ప్రతిరోజూ తనకు కేటాయించిన గ్రామాల్లోని వైఎస్సార్ విలేజ్ క్లీనిక్, పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రాలను సందర్శించి వైద్య సేవలు అందిస్తారు.
వైద్యుడు తనకు కేటాయించిన అదే గ్రామాన్ని నెలలో కనీసం రెండు సార్లు సందర్శించి వైద్యసేవలు అందిస్తారు. ఒక వైద్యుడు పలుమార్లు అదే గ్రామంలో ఉన్న అదే పేషెంట్‌ను సందర్శించడం ద్వారా ఆ పేషెంట్‌కు డాక్టర్‌కు మధ్య బాండింగ్ ఏర్పడుతుంది. ఆ డాక్టర్‌కు ఆ పేషెంట్ హెల్త్ ప్రొఫైల్ మీద పూర్తి అవగాహన ఉండడంతో మెరుగైన చికిత్స అందించడం సులభతరం అవుతుంది. వైద్యునికి ఆ గ్రామంపై పూర్తి అవగాహన, ఆ గ్రామంలోని ప్రతి వ్యక్తినీ పేరు పేరునా గుర్తించే అవకాశం ఉంటుంది.
ఇందుకోసం వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రత్యేకంగా అందుబాటులోకి తెచ్చిన 936 మొబైల్ మెడికల్ యూనిట్లను (104 అంబులెన్స్‌లు) నాడు నేడులో భాగంగా ఏర్పాటుచేసిన 10,032 వైఎస్సార్ విలేజ్ క్లీనిక్‌లతో అనుసంధానించడం ద్వారా ఫ్యామిలీ డాక్టర్ విలేజ్ క్లీనిక్‌లోని సీహెచ్‌ఓ, ఏఎన్‌ఎమ్, ఆశా కార్యకర్తల సహకారంతో వైద్యసేవలు అందిస్తారు.
ప్రతి విలేజ్ క్లీనిక్‌లో 14 రకాల టెస్టులు, 105 రకాల మందులు అందుబాటు, మరింత మెరుగైన వైద్యం అవసరమైన పేషెంట్లను ఫ్యామిలీ డాక్టర్ వైఎస్సార్ హెల్త్ క్లీనిక్ ద్వారా ఆరోగ్యశ్రీ ఆసుపత్రులకు రిఫర్ చేయడం జరుగుతుంది. ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స పొందిన రోగులకు చికిత్సానంతర పర్యవేక్షణ కూడా ఫ్యామిలీ డాక్టర్ ద్వారా, విలేజ్ క్లీనిక్‌లో ఆరోగ్యశ్రీ రిఫరల్ సేవలు కూడా అందిస్తారు.
ప్రభుత్వ ఆసుపత్రులలో ఏ ఒక్క పోస్టు ఖాళీగా ఉండకూడదనే ఉద్దేశ్యంతో కొత్తగా 49,000 మందికి పైగా వైద్య సిబ్బందిని నియమించింది వైఎస్ జగన్ ప్రభుత్వం. సగటున దేశంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సిబ్బంది కొరత 61 శాతం ఉంటే మన రాష్ట్రంలో అది కేవలం 4 శాతం మాత్రమే.
ఫ్యామిలీ డాక్టర్ అందించే వైద్య సేవలు
సాధారణ వైద్య సేవలు, ప్రసూతి ఆరోగ్య సంరక్షణ సేవలు, బాలింతల ఆరోగ్య సంరక్షణ సేవలు, రక్తహీనత పరీక్షలు మరియు చికిత్స, అసంక్రమిత వ్యాధులకు ఆరోగ్య పరీక్షలు మరియు చికిత్స, పాఠశాలలో వైద్య కార్యక్రమం, అంగన్‌వాడీ కేంద్ర సందర్శనం, మంచాన ఉన్న రోగుల గృహ సందర్శన.
ఫ్యామిలీ డాక్టర్ ఇంకా ఏం చేస్తారంటే..
దీర్ఘకాలిక వ్యాధుల సర్వే ద్వారా గుర్తించబడిన బి.పి, షుగర్, గుండె జబ్బులు, క్యాన్సర్ లాంటి అసంక్రమిత వ్యాధిగ్రస్తులకు (ఎన్‌సీడీ) చికిత్స, రెగ్యులర్ ఫాలోఅప్ మరియు నివారణ ఆరోగ్య సేవలను అందజేయడం ద్వారా వ్యాధి తీవ్రరూపం దాల్చకుండా పర్యవేక్షించడం, ఔటాఫ్ పాకెట్ ఖర్చు తగ్గించడం. ఈ–సంజీవని వీడియో టెలి మెడిసిన్ సేవల ద్వారా స్పెషలిస్ట్ వైద్యుల సర్వీసులను గ్రామ స్ధాయిలో ప్రజలకు అందుబాటులోకి తీసుకుని రావడం.
ఫ్యామిలీ డాక్టర్ అంగన్‌వాడీ కేంద్రాల సందర్శన ద్వారా పౌష్టికాహార లోపం ఉన్న చిన్నారులు మరియు రక్తహీనత ఉన్న గర్భిణీ స్త్రీలను, బాలింతలను గుర్తించి వారికి చికిత్స అందించడం.
స్కూళ్ళలో విద్యార్ధుల ఆరోగ్య పర్యవేక్షణ, శానిటేషన్, ఆరోగ్యం మీద అవగాహన కల్పించే కార్యక్రమాలను కూడా చేపడుతారు.