Thursday, September 19, 2024
Homeఆంధ్రప్రదేశ్Ap politics: జగన్ కు ముందు గొయ్యి.. వెనుక నుయ్యి..!

Ap politics: జగన్ కు ముందు గొయ్యి.. వెనుక నుయ్యి..!

Ap politics: ఈ ఏడాది పార్లమెంటు శీతాకాల సమావేశాలకు తెరలేచింది. డిసెంబర్ 7నుంచి 29 వరకు 23 రోజులు సమావేశాలు జరుగుతాయి. ఈ విషయాన్ని పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి వెల్లడించారు. ఈ శీతాకాల పార్లమెంటు సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం మొత్ం 30 బిల్లుల వరకూ ప్రవేశ పెట్టే అవకాశం ఉందని చెబుతున్నారు వాటిలో విద్యుత్ సవరణ బిల్లు, వ్యక్తిగత సమాచారం భద్రత బిల్లు, న్యూఢిల్లీలో ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ సవరణ బిల్లు వంటి కీలక బిల్లులు కూడా ఉన్నట్లు చెబుతున్నారు.

- Advertisement -

పార్లమెంటులో ప్రవేశపెట్టే మిగతా బిల్లుల సంగతి ఎలా ఉన్నా.. విద్యుత్ సవరణ బిల్లు మాత్రం వైసీపీని ముఖ్యంగా జగన్ ను ఇరుకున పెడుతుందని పరిశీలకులు అంటున్నారు. ఈ బిల్లు పార్లమెంటు ఆమోదం పొందితే.. వ్యవసాయ మోటార్లకు విద్యుత్ మీటర్లు బిగిస్తారు. దాంతో ఇప్పటి దాకా ఉచితంగా విద్యుత్ సరఫరా పొందుతున్న రైతులు విద్యుత్ ఇక బిల్లులు చెల్లించి ఆ తరువాత ప్రభుత్వం తాము చెల్లించిన సొమ్ము ఎప్పుడు ఖాతాలో వేస్తుందా అని ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అదే జరిగితే వచ్చే ఎన్నికల్లో వైసీపీకి అన్నదాత వాత తప్పదు.
బీజేపీ నేతృత్వంలో కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే కూటమిలో వైసీపీ భాగస్వామి కాదు. అయినా పార్లమెంటులో ఎప్పుడు ఏ బిల్లు ప్రవేశపెట్టినా.. జగన్ పార్టీ బేషరతుగా మద్దతు ఇస్తూ వస్తోంది. గడిచిన మూడున్నరేళ్లుగా ఇదే తంతు నడుస్తోంది. నిజానికి లోక్ సభలో గానీ, రాజ్యసభలో గానీ వైసీపీ మద్దతు లేకపోయినా బిల్లులను ఆమోదించుకోగల బలం ఎన్డీయే సర్కార్ కు ఉంది. అయినాసరే.. వైసీ ఎంపీలు పిలవనమ్మ వాయినానికి ముందు వచ్చినట్లు తగుదునమ్మా అంటూ అడగక ముందే మద్దతు ఇచ్చేస్తున్నారు. ఇందుకు కారణమేమిటన్నది ప్రత్యేకంగా ఎవరూ చెప్పాల్సిన భయం లేదు.. జగన్ అక్రమాస్తుల కేసుల భయం వెన్నాడుతుండటంతోనే తనకు రాజకీయంగా నష్టం జరుగుతుందని తెలిసినా, రాష్ట్రానికి అన్యాయం జరుగుతోందని అర్ధమౌతున్నా జగన్ బీజేపీ తానా అంటే తందానా అంటున్నారు. ఇప్పుడు విద్యుత్ సవరణ బిల్లు విషయంలో కూడా అదే అనక తప్పని పరిస్థితి జగన్ ది.
కేసుల భయంతోనే ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాల విషయంలో జగన్ రాజీ పడుతున్నారని, ప్రత్యేక హోదా విషయంలో, వెనుకబడిన జిల్లాల ప్యాకేజ్ ,, పోలవరం ప్రాజెక్టు నిధులు తదితర అంశాలలో పట్టుబట్టకుండా జగన్ కేంద్రం మాటకు, చేతకు తందానా అంటూ వస్తున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. పరిశీలకులు కూడా అదే కారణమని విశ్లేషిస్తున్నారు.
అయితే ఈసారి విద్యుత్ సవరణ బిల్లు పార్లమెంటులో ప్రవేశపెడితే జగన్ కు గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లేనని రాజకీయ వర్గాలు అంటున్నాయి. బిల్లుకు మద్దతు తెలపకుంటే కేంద్రంతో తంటా.. తెలిపితే రాష్ట్రంలో రాజకీయంగా పూడ్చుకోలేని నష్టం. ఈ పరిస్థితుల్లో జగన్ కు ముందు గొయ్యి వెనుక నుయ్యి చందంగా జగన్ పరిస్థితి మారుతుందని పరిశీలకులు అంటున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News