ఎంపీ విజయసాయి రెడ్డి(Vijayasai Reddy) రాజీనామాపై వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్(YS Jagan) కీలక వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీకి ఉన్న 11 మంది రాజ్యసభ సభ్యుల్లో నలుగురు ఇప్పటివరకు బయటకు వెళ్లారని.. అయినా వైసీపీకి ఏం కాదన్నారు. రాజకీయాల్లో ఎవరికైనా క్యారెక్టర్ ఉండాలన్నారు. ఎవరికో భయపడి నిర్ణయాలు తీసుకునే వారు రాజకీయాల్లో పనికిరారు అని పేర్కొన్నారు. భయం, ప్రలోభాలకు లొంగి క్యారెక్టర్‌ను తగ్గించుకోవద్దని సూచించారు. సాయిరెడ్డికైనా, ఇంకెవరికైనా ఇదే వర్తిస్తుందని తెలిపారు. వైసీపీ కేవలం దేవుడి దయ, ప్రజల ఆశీస్సులతోనే నడుస్తుందని వెల్లడించారు.
ఇక తనను అసెంబ్లీకి రావాలని కూటమి నేతలు మాట్లాడుతున్నారని… అసెంబ్లీకి వస్తే మాట్లాడే అవకాశం ఇస్తారా? అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రికి ఇచ్చినంత సమయం తనకు కూడా ఇవ్వాలని షరతు పెట్టారు. గత ఐదేళ్ల పాలనలో కార్యకర్తల విషయంలో చాలా తప్పు చేశానని వ్యాఖ్యానించారు. జగన్ 2.Oలో కార్యకర్తలకే తొలి ప్రాధాన్యత ఉంటుందని స్పష్టం చేశారు.