Friday, September 20, 2024
Homeఆంధ్రప్రదేశ్Jagan: జనం చెంతకే సంక్షేమం, అర్హతే ప్రామాణికం

Jagan: జనం చెంతకే సంక్షేమం, అర్హతే ప్రామాణికం

అర్హులై ఉండి ఏ కారణం చేతనైనా లబ్ది అందని వారికి మరో అవకాశం.

ఆగష్టు, 2023 నుంచి డిసెంబరు, 2023 వరకు అమలైన వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించి ఏ కారణం చేతనైనా లబ్ది అందని 68,990 మంది అర్హులకు, రూ.97.76 కోట్లను సీఎం క్యాంపు కార్యాలయం నుంచి బటన్‌ నొక్కి వారి ఖాతాల్లో జమ చేసిన ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌.

- Advertisement -

ఈ సందర్భంగా సీఎం వైయస్‌.జగన్‌ ఏమన్నారంటే…

సంతృప్తి నిచ్చే గొప్ప కార్యక్రమమిది
ఈ రోజు దేవుడి దయతో మరో మంచి కార్యక్రమం జరుగుతుంది. నా దగ్గర నుంచి మొదలుపెడితే.. కలెక్టర్లు, అక్కడ నుంచి సచివాలయస్ధాయి వరకు ప్రతి ఒక్కరికీ ఇదొక పెద్ద సంతృప్తినిచ్చే కార్యక్రమం. ఎవరికైనా, ఎప్పుడైనా ఏ సమస్య వచ్చినా ప్రభుత్వం దాన్ని పరిష్కరించడం కోసం వాళ్ల తరపున మంచి సేవకుడిగా ఉందన్న భరోసా కల్పించే కార్యక్రమం ఇది.
ఎవరైనా ఏ కారణంచేతనైనా పొరపాటు ఒక పథకం వాళ్లకు అందకపోతే.. ఆ పథకంలో వాళ్లకు అర్హత ఉండి కూడా అందకపోయిన పరిస్థితులు వచ్చినప్పుడు.. ఆ స్కీం అయిపోయిన నెల రోజులలోపు వారికి టైం ఇచ్చి, మరలా దరఖాస్తు పెట్టించి.. దాన్ని వెరిఫై చేయించి, ఆరునెలల్లోపు ఆ లబ్ధిదారుడికి అందజేసే మంచి కార్యక్రమం జరుగుతుంది.

ప్రజలకు ప్రభుత్వం తోడుగా నిలబడుతుంది
ప్రజలకు ఈ ప్రభుత్వం తోడుగా నిలబడుతుందనే జవాబు చెప్పే సంకేతం ఈ కార్యక్రమం వల్ల జరుగుతుంది. ప్రతి ఆరునెలలకొకసారి క్రమం తప్పకుండా జూన్, జూలైలో ఒకసారి, మరలా డిసెంబరు, జనవరి నెలల్లో మరొక్కసారి ఆ ఆరునెలలకు సంబంధించిన పథకాలకు.. తెలియక దరఖాస్తు చేసుకోకపోయినా, దరఖాస్తు చేసుకోవడంలో ఏదైనా పొరపాట్లు వల్లనో, కావల్సిన పత్రాలు ఇవ్వని పరిస్థితుల్లో కానీ, ఆధార్‌తో మిస్‌మ్యాచ్‌ వంటి ఇతరత్రా కారణాల వల్ల.. ఆరు నెలల్లో ఆయా పథకాలు రాని పరిస్థితి ఉంటే.. ఏ ఒక్కరూ మిస్‌ కాకుండా ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం.

2021లో మొదలుపెట్టి- ఆరునెలలకోమారు
2021లో ఈ కార్యక్రమం మొదలుపెట్టి ప్రతి ఆరునెలలకొకమారు చేస్తున్నాం. ఈ ఐదు పర్యాయాలను లెక్కలోకి తీసుకుంటే దాదాపు రూ.1,700 కోట్లు అర్హత ఉండి పొరపాటున మిస్‌ అయిన లబ్దిదార్లకు మరలా తోడుగా నిలబడుతూ వారికి అందించాం. ఇందులో భాగంగా వివిధ పథకాలకు సంబంధించి దాదాపుగా 68,990 మందికి లబ్ది చేకూరుస్తూ సుమారు రూ.98 కోట్ల మొత్తాన్ని వాళ్ల అకౌంట్ల ద్వారా అందిస్తున్నాం.

వివిధ పథకాల్లో మిస్‌ అయిన వారికి అండగా..
అమ్మఒడి కార్యక్రమాన్ని మనం తీసుకొచ్చినప్పుడు 42.62 లక్షల మంది అర్హత పొందారు. వారందరి ఖాతాల్లోకి డబ్బులు పడ్డాయి. ఈ పథకానికి సంబంధించి వివిధ కారణాల వల్ల మిస్‌ అయిన మరో 40,616 మంది మరలా దరఖాస్తు చేస్తుకుంటే ఇవాళ నగదు అందిస్తున్నాం.
అలాగే జగనన్న చేదోడు ద్వారా అప్పట్లో 3.25లక్షల మందికి మంచి జరిగింది. ఇప్పుడు వివిధ కారణాల వల్ల అందుకోలేకపోయిన మరో 15వేల మందికి ఇస్తున్నాం. ఈబీసీ నేస్తం కింద అప్పడు 4.40 లక్షల మందికి మంచి జరగ్గా.. ఇప్పుడు మరో 4,180 మందికి లబ్ది జరుగుతుంది. వైఎస్సార్‌ వాహనమిత్ర ద్వారా అప్పట్లో 2.80లక్షల మందికి మంచి జరగ్గా ఇప్పుడు మరో 3,030 మందికి మంచి చేస్తున్నాం. మత్స్యకారభరోసా ద్వారా అప్పుడు 1.20లక్షల మందికి మంచి జరగ్గా.. ఇవాళ మరో 2వేల మందికి లబ్ది జరుగుతుంది. కళ్యాణమస్తు– షాదీతోపా ద్వారా అప్పట్లో 29,934 మందికి మేలు జరిగితే.. ఇప్పుడు 1,912 మందికి లబ్ధి జరుగుతుంది. వైఎస్సార్‌ కాపునేస్తం ద్వారా 3.60 లక్షల మందికి అప్పుడు మేలు జరగ్గా… ఇవాళ మరో 1,884 మందికి మంచి చేస్తున్నాం. నేతన్న నేస్తం ద్వారా అప్పట్లో 80,686 మందికి మంచి జరగ్గా… ఇవాళ మరో 352 మందికి మంచి చేస్తున్నాం.

1.17 లక్షల కొత్త పెన్షన్లు
వీళ్లే కాకుండా.. కొత్తగా మరో 1,17,161 మందికి పెన్షన్లు మంజూరు చేసే కార్యక్రమం. ఆరునెలలకొకమారు మిగిలిపోయిన వారు అర్హులై ఉంటే.. దరఖాస్తు చేసుకుంటే, వెరిఫై చేసి మంజూరు చేసే కార్యక్రమం చేస్తున్నాం. మరో 1,11,321 మందికి కొత్త బియ్యం కార్డులను కూడా ఈ నెల నుంచి అందిస్తున్నాం. మరోవైపు 6,314 మందికి కొత్తగా ఆరోగ్యశ్రీ కార్డులు, 34,623 మందికి కొత్తగా ఇళ్లస్ధలాలు అందిస్తున్నాం. ఇవన్నీ కూడా పథకమేదైనా.. ఆరునెలలకొకమారు అర్హులెవరూ మిస్‌ కాకూడదు అని, పేదవారు ఇబ్బందిపడకూడదని, సాచ్యురేషన్‌ పద్దతిలో వివక్షకు తావులేకుండా, లంచం అనే పదానికి తావులేకుండా ఈ కార్యక్రమాన్ని జరిపిస్తున్నాం. పథకం అయిన వెంటనే నెల రోజులు గడువు ఇచ్చి వారు దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పిస్తు.. వారితో దరఖాస్తు పెట్టిస్తున్నాం. దీనికోసం వాలంటీర్‌ సేవలు అందుబాటులో ఉంచుతున్నాం. సచివాలయానికి వెళ్లి దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఉంది. లేదంటే జగనన్నకు చెబుదాం 1902కు కాల్‌ చేసినా అక్కడ నుంచే వాళ్లు ఎలా అఫ్లై చేసుకోవాలి, ఏ పత్రాలు ఇవ్వాలన్నది గైడెన్స్‌ ఇస్తారు.

అర్హులు మిగిలిపోకూడదన్న భావనతో
ఇవన్నీ కూడా జవాబుదారీతనం, పారదర్శకతతో ఏ ఒక్క అర్హులూ ఉండిపోకూడదు అన్న భావనతో ప్రభుత్వం అడుగులు వేస్తోందని చెప్పే సంకేతాలు. వీటిని 6 నెలలకొకమారు చేస్తూ.. ప్రజలకు మంచి చేసేందుకు మన ప్రభుత్వం ఎంత తోడుగా ఉందో చెప్పడానికి ఈ కార్యక్రమం ఒక సందేశంగా పనిచేస్తుంది.

కలెక్టర్లు దగ్గర నుంచి సచివాలయం సిబ్బంది వరకూ ప్రతి ఒక్కరూ ఎంతో ధ్యాసపెట్టి, ఏ ఒక్కరూ మిగిలిపోకుండా వాళ్లందరికీ తోడుగా నిలబడి, సహాయ సహకారాలు అందిస్తున్నారు. వీళ్లందరికీ ఆల్‌ ది బెస్ట్‌ తెలియజేస్తూ… కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతున్నాం అని సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ తన ప్రసంగం ముగించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News