Sunday, March 30, 2025
Homeఆంధ్రప్రదేశ్Jagan: పవన్ కల్యాణ్‌పై జగన్ మరోసారి సంచలన వ్యాఖ్యలు

Jagan: పవన్ కల్యాణ్‌పై జగన్ మరోసారి సంచలన వ్యాఖ్యలు

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan)పై వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్(Jagan) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందూ ధర్మంపై పవన్‌కు మాట్లాడే అర్హత లేదని విమర్శించారు. కాశీనాయన క్షేత్రాన్ని అధికారులు కూల్చేస్తుంటే డిప్యూటీ సీఎంగా ఉండి కూడా ఒక్క మాట కూడా మాట్లాడలేదని మండిపడ్డారు. ఈమేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.

- Advertisement -

దేవుడు అంటే భక్తి, భయం ఉన్నది ఎవరికి? ఎవరి హయాంలో ఆధ్యాత్మిక శోభ విలసిల్లింది? ఎవరి హయాంలో హైందవ ధర్మాన్ని పరిరక్షించారు? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రసిద్ధ కాశినాయన క్షేత్రంలో కూల్చివేతలు, రాష్ట్రంలో ఆలయాలపైన, హిందూ ధర్మంపై జరుగుతున్న దాడులకు ప్రత్యక్ష సాక్ష్యాలు కావా? అటవీ ప్రాంతంలో ఉన్న కాశినాయన క్షేత్రంలో నిర్మాణాల నిలిపివేత, వాటి తొలగింపుపై ఆగస్టు7, 2023న కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ ఆదేశాలు ఇచ్చినా, ఆ క్షేత్ర పరిరక్షణకు మా ప్రభుత్వం నడుంబిగించిన మాట వాస్తవం కాదా?

అదే నెల ఆగస్టు 18, 2023న అప్పటి కేంద్ర అటవీశాఖ మంత్రి భూపేంద్ర యాదవ్‌గారికి ముఖ్యమంత్రి హోదాలో నేనే స్వయంగా లేఖ రాసి కాశినాయన క్షేత్రం ఉన్న 12.98 హెక్టార్ల భూమిని అటవీశాఖ నుంచి మినహాయించాలని, ఆ క్షేత్రానికి రిజర్వ్‌ చేయాలని, దీనికోసం ఎలాంటి పరిహారం కోరినా, ఎలాంటి ఆంక్షలను విధించినా తు.చ.తప్పక పాటిస్తామని లేఖలో చాలా స్పష్టంగా చెప్పాం. మా ప్రయత్నాలతో కేంద్రం తన చర్యలను నిలుపుదల చేసింది. మా ఐదేళ్ల పాలనలో కాశినాయన క్షేత్రానికి వ్యతిరేకంగా ఎవ్వరూ ఒక్క చర్యకూడా తీసుకోలేదు. ఆలయాలపట్ల, ఆధ్యాత్మిక కేంద్రాల పరిరక్షణపట్ల మాకున్న చిత్తశుద్ధికి నిదర్శనం ఇది.

మరోవైపు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 6 నెలల నుంచే ఇదే కాశినాయన క్షేత్రంలో ఏం జరిగిందో రాష్ట్రం అంతా చూస్తోంది. ఒక ప్రసిద్ధ క్షేత్రంపై బుల్డోజర్లు నడిపి కిరాతకంగా, రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో, కలెక్టర్‌ ఆదేశాలతో, ఆర్డీఓ పర్యవేక్షణలో కూల్చివేస్తూ వచ్చారు. చంద్రబాబు గారి ఆదేశాలమేరకు, డిప్యూటీ సీఎం పర్యవేక్షణలో ఉన్న తన పర్యావరణ, అటవీశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ ఇచ్చిన కూల్చివేత ఉత్తర్వులతో హిందూ ధర్మంపైన, ఆధ్యాత్మిక క్షేత్రాలపైన అధికార అహంకారంతో దాడిచేశారు. ఇవిగో ఆధారాలు, ఏమిటీ మీ సమాధానం?” అని ప్రశ్నించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News