Saturday, November 15, 2025
Homeఆంధ్రప్రదేశ్YS Jagan: అనకాపల్లిలో టెన్షన్ వాతావరణం.. కాసేపట్లో జగన్ రాక!

YS Jagan: అనకాపల్లిలో టెన్షన్ వాతావరణం.. కాసేపట్లో జగన్ రాక!

YS Jagan visit anakapalle medical college: ఏపీలోని మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించాలని కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. వైసీపీ అధినేత జగన్ అనకాపల్లి జిల్లాలో ఈ రోజు పర్యటన చేపట్టనున్నారు. ముందుగా నర్సీపట్నంలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని అనుకున్నప్పటికీ.. పోలీసుల ఆంక్షల నేపథ్యంలో ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారు. ఈ నేపథ్యంలో జగన్ నర్సీపట్నం మెడికల్ కాలేజీని సందర్శించనున్నందున ఆ ప్రాంతంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తుగా భారీ భద్రతను ఏర్పాటు చేశారు.

- Advertisement -

జగన్ పర్యటనకు కఠిన షరతులు: జగన్ పర్యటనకు సంబంధించి పోలీసులు కఠిన షరతులతో కూడిన అనుమతులను జారీ చేశారు. రూల్స్ అతిక్రమిస్తే క్రిమినల్ చర్యలు తప్పవని డీజీపీ హరీశ్ కుమార్ గుప్తాహెచ్చరించారు. జిల్లా పోలీసులు జగన్‌తో పాటు వైసీపీ నేతలను ఉద్దేశించి పలు హెచ్చరికలు చేశారు. నిర్దేశించిన రూట్ కాకుండా వేరే మార్గంలో వెళ్లినా, నిబంధనలను ఉల్లంఘించినట్లే పరిగణించబడుతుందని జగన్‌ను ఉద్ధేశించి పోలీసులు తెలిపారు. భారీ జనసమీకరణ చేసినా చర్యలు తప్పవని పేర్కొన్నారు. బహిరంగ సభలు నిర్వహనకు అనుమతి లేదని అన్నారు.

10 వాహనాలకు మాత్రమే అనుమతి: జగన్ వెళ్లే మార్గంలో ఊరేగింపులు, ర్యాలీలకు అనుమతి లేదని పేర్కొన్నారు. ప్రజలు రోడ్ల పక్కన నిలబడి మాత్రమే తమ అభిమానాన్ని, మద్దతును తెలపాలని సూచించారు. జగన్ కాన్వాయ్‌లో కేవలం 10 వాహనాలకు మాత్రమే అనుమతి ఉందని తెలిపారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించబోమని పోలీసులు స్పష్టం చేశారు. మరోవైపు, నర్సీపట్నంలో ‘YSRCP Never Again’ అనే హోర్డింగ్‌లు వెలిసినట్లు సమాచారం. ఈ పరిణామాల మధ్య జగన్ పర్యటన హైటెన్షన్ వాతావరణాన్ని తలపిస్తుంది.

కఠిన చర్యలు తప్పవు: మాజీ సీఎం జగన్‌ అనకాపల్లి పర్యటన సందర్భంగా పార్టీ కార్యకర్తలు ఎట్టి పరిస్థితుల్లోనూ జాతీయ, రాష్ట్ర హైవేలపై గుమిగూడి ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించవద్దని అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్‌ సిన్హా కోరారు. ఇటీవల తమిళనాడులోని కరూర్‌లో జరిగిన తొక్కిసలాట ఘటనను దృష్టిలో ఉంచుకోవాలని కార్యకర్తలకు సూచించారు. జగన్‌ పర్యటనలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసుల మార్గదర్శకాలను నిర్వాహకులు పాటించాలని తెలిపారు. లేకుంటే కఠిన చర్యలు తప్పవని వైసీపీ పార్టీ కార్యకర్తలను హెచ్చరించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad