YSRCP: పోచిమరెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి.. సీఎం జగన్ మోహన్ రెడ్డికి మేనమామ.. జగన్ తల్లి విజయమ్మకి స్వయానా సోదరుడు. అందునా.. దాదాపుగా పెరిగింది అంతా రాజశేఖర రెడ్డి ఇంట్లోనే. రాజకీయంగా ఆది నుండీ రవీంద్రనాథ్ రెడ్డి వైఎస్ కుటుంబంతోనే ఉండడంతో ఆ ఇంట్లో రవీంద్రనాథ్ రెడ్డికి చెల్లుబాటు కూడా ఎక్కువే. తనకంటే వయసులో చిన్నవాడైన జగన్ కు చిన్నప్పటి నుండి కొంతమేర కేర్ టేకర్ గా కూడా వ్యవహరించడంతో ఇప్పటి వరకు వైసీపీలో, జిల్లాలో రవీంద్రనాథ్ రెడ్డి హవా కొనసాగుతూ వచ్చింది. కమలాపురం నియోజకవర్గంతో పాటు కడప జిల్లాలో రవీంద్రనాథ్ రెడ్డి హవా ఎక్కువగానే ఉంటుంది.
అయితే, అదంతా ఇంతకు ముందు మాట. ఇప్పుడు ఈ మేన మామ.. మేనల్లుడు మధ్య మాటల్లేవని ప్రచారం జరుగుతుంది. సీఎం జగన్ మోహన్ రెడ్డికి ఇప్పుడు సొంత కుటుంబంలో కుంపట్లు తలపోటుగా మారుతున్నాయి. ముందు జగన్ సోదరి అన్నని కాదని తెలంగాణలో పార్టీ పెడితే.. జగన్ తల్లి విజయమ్మ వైసీపీని వదిలేసి షర్మిళ వైఎస్ఆర్టీపీ వైపు వెళ్లిపోయారు. అయితే, సహజంగా మేనమామ కనుక రవీంద్రనాథ్ రెడ్డి మొదట్లో కుటుంబ వ్యవహారాలలో జోక్యం చేసుకొని సామరస్యం చేసేందుకు ప్రయత్నించారట.
కానీ, రవీంద్రనాథ్ రెడ్డి కుటుంబ వ్యవహారాలలో జోక్యం చేసుకోవడం నచ్చని జగన్ ఆయన్ను దూరం పెట్టారని టాక్ నడుస్తుంది. తాజాగా జగన్ కడప జిల్లా పర్యటనకు మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి హాజరైనా కనీసం జగన్ పలకరించకుండానే.. తన మానాన తను ఉన్నారని చర్చనడుస్తోంది. దీంతో కడప జిల్లాలో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది. మేనమామ.. మేనల్లుడి అంతర్గత కలహాలపై ఇప్పుడు వైసీపీలో తీవ్ర చర్చ సాగుతున్నట్లు తెలుస్తుంది.