జగనన్న తోడు పధకం కింద చిరు వ్యాపారులు రుణాలు పొంది సకాలంలో చెల్లించిన 17,691 మంది లబ్ధిదారులకు వడ్డీ రియంబర్స్మెంట్ కింద రూ.45.90 లక్షలు జమ చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ డా. మనజిర్ జిలాని సమూన్ పేర్కొన్నారు. కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ లో తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి జగనన్న తోడు పథకం కింద రోడ్ల పక్కన, తోపుడు బండ్లపై పండ్లు, కూరగాయలు అమ్ముకునే చిన్న, చిన్న చిరు వ్యాపారులకు 7 విడతలో భాగంగా 5,10,412 మందికి ప్రభుత్వం మరో విడత వడ్డీ లేని రూ.549.70 కోట్ల రుణాలను అందజేయడంతో పాటు గతంలో ఈ పథకం ద్వారా రుణాలు పొంది, సకాలంలో చెల్లించిన వారికి రూ. 11.03 కోట్ల వడ్డీ మొత్తాన్ని కంప్యూటర్ బటన్ నొక్కి నేరుగా లబ్ధిదారుల ఖాతాలకు జమ చేసే బృహత్తర కార్యక్రమాన్ని లైవ్ ద్వారా జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి, జిల్లా కలెక్టర్ డా.మనజిర్ జిలాని సమూన్, మైనారిటీ సంక్షేమ అభివృద్ధి ప్రభుత్వ సలహాదారు హబీబుల్లా, ఏపీఎస్పీడీసీఎల్ డైరెక్టర్ శశికళారెడ్డి, హస్తకళల డైరెక్టర్ సునీత అమృతరాజ్, డిఆర్డిఏ పీడి శ్రీధర్ రెడ్డి, మెప్మా పీడీ శోభ, ఎల్డిఎం రవీంద్ర తదితరులు వీక్షించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డా. మనజిర్ జిలాని సామూన్ మాట్లాడుతూ చిరు వ్యాపారుల కష్టాలు తీర్చేందుకు జగనన్న తోడు పథకం క్రింద నంద్యాల జిల్లాలో రుణాలు పొంది సకాలంలో చెల్లించిన 17,691 మంది లబ్ధిదారులకు వడ్డీ రియంబర్స్మెంట్ కింద రూ.45.90 లక్షలు జమ చేశామన్నారు. అలాగే ఈ ఏడాది డిసెంబర్ వరకు గుర్తించిన 18,274 మంది లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో 19.68 కోట్ల రూపాయల మొత్తాన్ని జమ చేయనున్నామన్నారు. ఇంకా ఎవరైనా అర్హత ఉండి కూడా పథకం అందకపోతే వారికి కూడా లబ్ధి చేకూరుస్తామన్నారు.
జగనన్న తోడు పథకం చిరు వ్యాపారులకు పెట్టుబడితో పాటు జీవనోపాధికి ఉపయోగపడుతోందన్నారు.జిల్లాలో జగనన్న తోడు వడ్డీ రియంబర్స్మెంట్ కింద ఆళ్లగడ్డ నియోజకవర్గంలో 2793 మంది లబ్ధిదారులకు రు.7.24 లక్షలు, బనగానపల్లిలో 2398 మందికి రు.6.22 లక్షలు, డోన్ లో 2803 మందికి రు.7.27 లక్షలు, నందికొట్కూర్ లో 2654 మందికి రు.6.88 లక్షలు, నంద్యాలలో 3980 మందికి రు.10.32 లక్షలు, పాణ్యంలో 765 మందికి రు.1.98 లక్షలు, శ్రీశైలంలో 2298 మందికి రు.5.96 లక్షలు, వెరసి మొత్తం 17,691 మంది లబ్ధిదారులకు రూ.45.90 లక్షల రూపాయలు నేరుగా జమ చేయడం జరిగిందని కలెక్టర్ తెలిపారు.ఉమ్మడి జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తోన్న జగనన్న తోడు ఆర్థిక సహాయాన్ని చిరు వ్యాపారులు చక్కగా సద్వినియోగం చేసుకోవాలన్నారు. వడ్డీలు, చక్ర వడ్డీలు కట్టలేక అవస్థలు ఎదుర్కొంటున్న చిరు వ్యాపారులు, సాంప్రదాయ చేతులు వృత్తుల వారి ఉపాధికి జగనన్న తోడు ఆసరాగా ఉంటుందన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్, మైనారిటీ సంక్షేమ అభివృద్ధి ప్రభుత్వ సలహాదారు, ఏపీఎస్పీడీసీఎల్ డైరెక్టర్, హస్తకళల డైరెక్టర్ తదితరులు లబ్ధిదారులకు చెక్కును అందజేశారు.