Saturday, November 23, 2024
Homeఆంధ్రప్రదేశ్Jagananna Thodu funds released: జగనన్న తోడు నిధుల విడుదల

Jagananna Thodu funds released: జగనన్న తోడు నిధుల విడుదల

వరుసగా 8వ విడత జగనన్న తోడు– చిరువ్యాపారుల ఉపాధికి ఊతం

పూర్తి వడ్డీ భారాన్ని ప్రభుత్వమే భరిస్తూ.. ఒక్కొక్కరికి రూ.10,000, అంతకు పైగా.. 3,95,000 చిరు వ్యాపారులకు రూ.417.94 కోట్ల వడ్డీలేని కొత్త రుణాలు, మొత్తం 16,73,576 మంది లబ్దిదారుల్లో ఈ విడతలో చెల్లించాల్సిన 5.81 లక్షల మంది లబ్దిదారులకు రూ.13.64 కోట్ల వడ్డీ రీయింబర్స్‌మెంట్‌ కలిపి మొత్తం రూ.431.58 కోట్లను సీఎం క్యాంపు కార్యాలయం నుంచి బటన్‌ నొక్కి లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసిన ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌.

- Advertisement -

ఈ సందర్భంగా సీఎం వైయస్‌.జగన్‌ ఏమన్నారంటే…:

8వ విడత జగనన్న తోడు…
దేవుని దయతో ఈ రోజు మరో మంచి కార్యక్రమం జరుపుకుంటున్నాం. లక్షల మంది చిరువ్యాపారులకు మేలు చేసే మంచి కార్యక్రమమిది. ఇవాళ 8వవిడత జగనన్న తోడు కార్యక్రమం జరుపుకుంటున్నాం. చిరువ్యాపారుల బ్రతుకులు ఎలా ఉంటాయన్నది మన కళ్లముందే కనిపిస్తున్నా… ఎప్పుడూ వీళ్ల బ్రతుకులు ఎలా మార్చాలి? ఎందుకు వీళ్ల బ్రతుకులు ఇలా ఉన్నాయి? వీళ్లకు డబ్బులు ఎలా పుట్టాలి?, వ్యాపారాలు చేసుకోవాలంటే వీళ్లు పడుతున్న కష్టాలు ఏంటి?, వాటిని ఎలా కడతేర్చాలని బహుశా ఎప్పుడూ, ఎవరూ ఇంతలా మనసుపెట్టి, ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకోలేదు.

నా కళ్లెదుట పాదయాత్రలో ప్రతి జిల్లాలో ఇది కనిపించేది. వ్యాపారం చేసుకోవడానికి కూరగాయలు, పనిముట్లు, ముడిసరుకు తెచ్చుకోవాలంటే.. కనీసం వేయి రూపాయలు వర్కింగ్‌ క్యాపిటల్‌ కావాలంటే, రూ.1000 అప్పు ఇస్తే… రూ.100 అప్పటికప్పుడే మినహాయించుకుంటారు. రూ.10 వడ్డికి వేయి రూపాయలు తెచ్చుకోవాల్సిన పరిస్థితి. అలా తీసుకుంటే తప్ప వీళ్ల బ్రతుకులు ముందుకు సాగని పరిస్థితి. దశాబ్దాలుగా ఇలాంటి పరిస్థితి కనిపిస్తున్నా.. దీనికి పరిష్కారం చూపించడానికి ఎవరూ ముందుకు రాలేదు.

మన ప్రభుత్వం – మానవత్వానికి చిరునామా
కానీ మన ప్రభుత్వం మానవత్వానికి చిరునామాగా నిలబడింది. ఇది గర్వంగా చెప్పుకునే అంశం. మనం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ పరిస్థితి గురించి బ్యాంకర్లతో మాట్లాడాం. బ్యాంకర్లను కూడా ఈ కార్యక్రమంలో ఇన్‌వాల్వ్‌ చేయడంతో పాటు వారిని కూడా కాన్ఫిడెన్స్‌లోకి తీసుకుని… రూ.10వేలు వారికి ఎలాంటి హామీ లేకుండా అప్పు ఇచ్చేలా ఏర్పాటు చేసాం. వారు సకాలంలో కట్టేట్టు మోటివేట్‌ చేయడంతో పాటు అలా చేస్తే… మొత్తం వడ్డీ భారం ప్రభుత్వమే భరిస్తుందని ఒక భరోసా కల్పించాం. ఇవన్నీ చేస్తూ ఇవాళ 8వ దఫా కింది ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం.

ఇవాళ జగనన్న తోడు 8వ విడతలో మరో 86,084 మంది చిరువ్యాపారులకు రూ.86 కోట్లు వడ్డీ లేని రుణాలుగా అందిస్తున్నాం. వీరితో పాటు గతంలో ఈ స్కీమ్‌ ద్వారా రుణాలు పొందిన 3.09 లక్షల మంది చిరువ్యాపారులకు రూ.332 కోట్ల రుణాలను రెన్యువల్‌ కూడా చేస్తున్నాం. మొత్తంగా ఈ కార్యక్రమం ద్వారా రూ.418 కోట్లను 3,95,000 మందికి ఇవాళ కొత్త రుణాలుగా అందిస్తున్నాం.

అంతే కాకుండా గతంలో జగనన్న తోడు స్కీం పరిధిలో రుణాలు తీసుకుని, సకాలంలో చెల్లించిన 5,80,968 లబ్దిదారులు సకాలంలో చెల్లించిన వడ్డీ రూ.13.64 కోట్లను తిరిగి వారికి ఇస్తున్నాం. మొత్తంగా ఇవాళ దాదాపు రూ.430 కోట్లు లబ్ది చేకూర్చుతూ వివిధ వర్గాలకు మంచి చేస్తున్నాం.

జగనన్న తోడు పథకం గత 7 విడతలుతో పాటు ఇవాళ ఇస్తున్న 8వ విడత కూడా పరిగణలోకి తీసుకుంటే ఇప్పటివరకు 16,73,576 మంది యూనిక్‌ లబ్ధిదారులైన చిరువ్యాపారులకు రూ.3373 కోట్లు వడ్డీ లేని రుణాలు ఇచ్చాం. దీంతో పాటు వాళ్ల తరపున వాళ్లు కట్టిన వడ్డీలు రూ.88.33 కోట్లు మరలా వారికి తిరిగి వెనక్కి ఇచ్చే గొప్ప అడుగులు ఈ నాలుగున్నర సంవత్సరాల్లో పడ్డాయి.

ఈ స్కీమ్ ద్వారా..
ఈ స్కీమ్‌ ద్వారా లబ్ది పొందిన వారి వివరాలు గమనిస్తే… మొత్తం లబ్దిదారుల్లో 73,072 మంది చిరువ్యాపారులు ఇప్పటికే నాలుగుసార్లు డబ్బులు కట్టి తీసుకున్నారు. అదే విధంగా 5,10,241 మంది లబ్దిదారులు 3 సార్లు డబ్బులు కట్టి తీసుకున్నారు. 3,98,229 మంది చిరువ్యాపారులు 2 దఫాలు రుణాలు పొంది వాటిని కట్టి, మళ్లీ తీసుకున్నారు.

ఈ కార్యక్రమం ద్వారా చిన్న, చిన్న బ్రతుకులు బ్రతుకుతున్న హస్తకళాకారులు, పుట్‌పాత్‌పై అమ్మకాలు చేసేవారు, వీధుల్లో తోపుడు బండ్లమీద కూరగాయలు అమ్ముకునేవారు, రోడ్డు పక్కన టిఫిన్‌ సెంటర్ల నిర్వాహకులు, గంపలు, బుట్టలపై అమ్మకాలు చేసేవారు, ఆటోలు, సైకిళ్లపై చిన్న, చిన్న వస్తువులు అమ్మకునేవారు, వివిధ వృత్తుల కళాకారులందరూ వీళ్లు బ్రతకడమే కాకుండా… కొందరు వీళ్లతో పాటు ఒకరిద్దరికి ఉపాధి కల్పించే కార్యక్రమం చేస్తున్నారు. ఇలాంటి వాళ్లకు జగనన్న తోడు కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుంది.

సకాలంలో చెల్లిస్తే.. రుణాలు పెంచే కార్యక్రమం
మొదటి సంవత్సరంలో వీళ్లకు రూ.10వేలు ఎలాంటి గ్యారంటీ లేకుండా ఇవ్వడం, సకాలంలో చెల్లించిన వారందరికీ ఏటా మోటివేట్‌ చేస్తూ ప్రభుత్వం తరపున వడ్డీని వెనక్కి ఇవ్వడం జరిగింది. అంతే కాకుండా ప్రతి సంవత్సరం రూ.1000 పెంచుతూ రూ.13,000 వరకూ తీసుకునిపోయేట్టుగా ఈ స్కీమ్‌ను అమలు చేయడం సంతోషాన్ని కలిగించే అంశం.

సాధికారత విషయంలో మరో విప్లవం.
సంతోషం కలిగించే ఇంకా కొన్ని అంశాలు చూస్తే…
ఈ స్కీం ద్వారా మేలుపొందిన 16,73,000 మంది లబ్ధిదారుల్లో 87.13శాతం నా అక్కచెల్లెమ్మలే ఉన్నారు. మరో సంతోషకరమైన విషయం ఏమిటంటే.. ఈ 16.73 లక్షల మంది లబ్దిదారుల్లో 79.14 శాతం మంది ఎస్సీ, ఎస్టీ,బీసీ, మైనార్టీ వర్గాలకు చెందినవారే ఉన్నారు. సాధికారత విషయంలో ఇది మరో విప్లవమని చెప్పవచ్చు.
రాష్ట్రంలోనే గొప్ప విప్లవాత్మక అడుగులు పడుతున్నాయన్నది ఒక అంశం అయితే.. రెండోది దేశంలోనే ఇది దిక్సూచిగా ఉంది. ఎందుకంటే దేశం మొత్తం మీద కేంద్ర ప్రభుత్వం 7 శాతం వడ్డీకి 58,65,000 మందికి పీఎం స్వనిధి పేరుతో రుణాలు ఇస్తే… ఒక్క మన రాష్ట్రంలోనే 16,74,000 మంది ఉన్నారు. దేశ వ్యాప్తంగా రూ.10,220 కోట్లు రుణాలు ఇస్తే, మన రాష్ట్రంలో రూ.3373 కోట్ల రుణాలివ్వగలిగాం. ఎందుకు మనం ఇలా చేయగలిగాం, మిగిలిన రాష్ట్రాలు చేయలేకపోయాయో ఆలోచిస్తే… చాలా ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వస్తాయి.
కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు కలిపి వడ్డీ మొత్తం 7 శాతం వరకే రూ.138 కోట్లు కడితే, మన ఒక్క రాష్ట్రమే ఈ చిరువ్యాపారుల తరపున రూ.88 కోట్లు వరకు కట్టగలిగాం.

మన రాష్ట్రంలో గొప్ప వ్యవస్ధ– సచివాలయాలు, వాలంటీర్లు
మిగిలిన రాష్ట్రాలకు, మనకు ఎందుకు ఇంత తేడా వచ్చింది, మన ఫెర్‌ఫార్మెన్స్‌ ఎందుకు మిగిలిన రాష్ట్రాల కన్నా భిన్నంగా ఉంది ? దేశానికి మార్గనిర్దేశం చేసే విధంగా అడుగులు పడగలిగాయో గమనిస్తే… కారణం మన దగ్గర ఉన్న గొప్ప సచివాలయ, వాలంటీర్‌ వ్యవస్ధ. వీటి ద్వారా మనం పారదర్శకంగా రుణాలిప్పించడంతో పాటు అంతే స్ధాయిలో సకాలంలో తిరిగి పేమెంట్‌ చేయించగలుగుతున్నాం. అందులో సచివాలయ, వాలంటీర్‌ వ్యవస్ధది కీలకపాత్ర. రుణాల రికవరీ 95శాతానికిపైగా ఉందని చెప్పడం చాలా సంతోషకరమైన వార్త. సాధికారత విషయంలో ఇది చాలా పెద్ద అచీవ్‌మెంట్‌.

నాలుగున్నరేళ్లలో- గొప్ప అడుగులు
మనం రాకముందు పొదుపు సంఘాల రుణాలకు సంబంధించి 18 శాతం ఎన్‌పీఏలుగా ఉంటే… మనం వచ్చిన తర్వాత అది 0.3 శాతం లోపే. పరివర్తన అనేది ప్రతి అడుగులోనూ జరిగింది. గ్రామీణ ఎకానమీలో.. పేదరికంలో ఉన్న వాళ్ల చేయిపట్టుకుని నడిపించగలుగుతున్నాం. అక్కచెల్లెమ్మలు, మహిళా సాధికారత విషయంలో గొప్ప అడుగులు పడుతున్నాయి. వాళ్లకు జీవనోపాధి కల్పించేలా అడుగులు వేయడం, అమూల్, రిలయెన్స్, ఐటీసీ, పీ అండ్‌ జీ వంటి పెద్ద, పెద్ద కంపెనీలను తీసుకొచ్చి వారికి వ్యాపార అవకాశాలు కల్పించడం, బ్యాంకులతో టైఅప్‌ చేసి వారికి రుణాలు ఇప్పించే కార్యక్రమం కూడా చేయడం జరిగింది. ఆసరా, చేయూత, సున్నావడ్డీ వంటి పథకాల ద్వారా ప్రభుత్వం అన్నిరకాలుగా తోడుగా ఉంటూ చేయిపట్టుకుని నడిపిస్తూ మహిళ సాధికారత దిశగా అడుగులు వేయించగలిగాం. దానికి నిదర్శనంగా ఈ నాలుగున్నర సంవత్సరాలు నిల్చిపోతాయి.

దేవుడు ఈ గొప్ప కార్యక్రమాలను ఆశీర్వదించాలని, లబ్దిదారులకు మంచి జరగాలని, ఇంకా మంచి చేసే అవకాశం దేవుడు ఇవ్వాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానని సీఎం తన ప్రసంగం ముగించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News