Janasena Nellore District: ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా జనసేన కమిటీలన్నింటినీ రద్దు చేశారు. పార్టీ సిద్ధాంతాలకు, విధివిధానాలకు భిన్నంగా వ్యవహరిస్తున్న స్థానిక నాయకుల ప్రవర్తన, క్రమశిక్షణా రాహిత్యంపై వచ్చిన తీవ్రమైన ఫిర్యాదుల నేపథ్యంలో ఆయన ఈ కఠినమైన చర్య చేపట్టారు.
ఉమ్మడి నెల్లూరు జిల్లాకు చెందిన జిల్లా, నగర, మండల, మరియు గ్రామస్థాయి కమిటీలన్నింటినీ తక్షణమే రద్దు చేస్తూ పవన్ నిర్ణయం తీసుకున్నారు. జిల్లా సమన్వయ బాధ్యతలు నిర్వహిస్తున్న నేతలతో పాటు కమిటీల్లోని సభ్యులందరినీ వారి బాధ్యతల నుంచి తప్పించారు. జిల్లా నాయకుల మధ్య సమన్వయ లోపం, అంతర్గత విభేదాలు, క్రమశిక్షణా రాహిత్యంపై కార్యకర్తలు, మద్దతుదారుల నుంచి అధిష్టానానికి పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందాయి. కొత్త కమిటీలను నియమించేంతవరకు ఉమ్మడి నెల్లూరు జిల్లా పార్టీ వ్యవహారాలను జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం నేరుగా పర్యవేక్షిస్తుంది.
క్రమశిక్షణ లేని చోట పార్టీ వ్యవస్థ సక్రమంగా సాగదని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. కొద్ది రోజుల క్రితమే ఇదే తరహా కారణాలతో ఉమ్మడి ప్రకాశం జిల్లా కమిటీని కూడా రద్దు చేసిన సంగతిని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. పార్టీని క్షేత్రస్థాయి నుంచి మరింత పటిష్ఠం చేయడానికి, క్రమశిక్షణను కాపాడటానికి పవన్ తీసుకున్న ఈ నిర్ణయం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

