ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan) స్థాపించిన జనసేన(Janasena) పార్టీ అప్పుడే 11 ఏళ్లు పూర్తి చేసుకుంది. మార్చి 14వ తేదీతో 12వ ఏటలోకి అడుగుపెట్టబోతుంది. అయితే ఈసారి మాత్రం అధికారం చేపట్టి ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటోంది. దీంతో మార్చి 14న పవన్ సొంత నియోజకవర్గం పిఠాపురంలో ఆవిర్భావ సభ కనివినీ రీతితో నిర్వహించబోతున్నారు. ఇప్పటికే ఈ భారీ సభకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. లక్షల మంది కార్యకర్తలు వచ్చే అవకాశం ఉండటంతో పోలీసులు కూడా పటిష్ట భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇక ఈ సభకు ‘జయకేతనం’ అని పవన్ కల్యాణ్ నామకరణం చేశారని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. పిఠాపురం నియోజకవర్గంలో నిర్వహిస్తున్న ‘జయకేతనం’ సభ రాష్ట్ర చరిత్రలో నిలిచిపోతుందని తెలిపారు. ఈ సభకు రాష్ట్రం నలుమూలల నుంచి జనసైనికులు, వీర మహిళలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా జనసైనికులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారని పేర్కొన్నారు. ఈ ప్రాంతానికి విశేష సేవలందించిన మహానుభావులను స్మరించుకునే విధంగా మూడు ముఖద్వారాలకు వారి పేర్లు పెట్టామని వెల్లడించారు.
తొలి ద్వారానికి పిఠాపురం మహారాజు శ్రీ రాజా సూర్యరావు బహదూర్ పేరు పెట్టామని తెలిపారు. రెండవ ద్వారానికి డొక్కా సీతమ్మ పేరు.. మూడవ ద్వారానికి మల్లాది సత్యలింగం నాయకర్ పేరు పెట్టడం జరిగిందని వివరించారు. ఈ ముగ్గురు మహానుభావులు స్ఫూర్తిని భావితరాలకు అందించే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. భారతదేశ చరిత్రలో పోటీ చేసిన ప్రతి స్థానంలో జనసేన విజయం సాధించిందని, ఇది జనసైనికులు, వీర మహిళలు, నాయకుల నిస్వార్థ సేవలకు ఫలితమని కొనియాడారు. ఈ విజయాన్ని పురస్కరించుకుని ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసేందుకు ఈ సభను నిర్వహిస్తున్నట్లు నాదెండ్ల వెల్లడించారు.
