టీడీపీ యువనేత, మంత్రి నారా లోకేష్(Nara Lokesh)కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలనే అంశం ఏపీ రాజకీయల్లో కలకలం రేపుతోంది. లోకేష్‌ను డిప్యూటీ సీఎం చేయాలంటూ కొందరు టీడీపీ నేతలు చేసిన డిమాండ్ చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో జనసేన(Janasena) నేతలు కూడా ఈ అంశంపై తమదైన శైలిలో స్పందిస్తున్నారు. లోకేష్‌ను డిప్యూటీ సీఎం చేయాలని టీడీపీ నేతలు కోరుకోవడంలో తప్పు లేదని.. అయితే తమకు కూడా పవన్ కళ్యాణ్‌ను సీఎంగా చూడాలని ఉందని చెబుతున్నారు.
దీంతో ఇప్పటికే ఈ అంశంపై సీరియస్ అయిన టీడీపీ హైకమాండ్ ఈ అంశంపై ఎవరూ బహిరంగంగా మాట్లాడొద్దని పార్టీ నేతలకు ఆదేశాలు జరీ చేసింది. తాజాగా ఇదే అంశంపై జనసేన కేంద్ర కార్యాలయం కూడా స్పందించింది. దీనిపై జనసేన నేతలు, కార్యకర్తలు బహిరంగంగా మాట్లాడొద్దని, సోషల్ మీడియాలో స్పందించవద్దని ఆదేశాలు జారీ చేసింది. రెండు పార్టీల అధిష్టానాలు శ్రేణులకు కీలక పిలుపు ఇవ్వడంతో ఈ వివాదానికి ముగింపు పడే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.