Kurupam Gurukulam Jaundice : పార్వతీపురం మన్యం జిల్లాలోని కురుపాం గురుకుల విద్యార్థినులను పచ్చకామెర్ల వ్యాధి వణికిస్తున్న ఘటనపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. వారం రోజుల్లోనే ఇద్దరు పదో తరగతి బాలికలు (సుమారు 60 మంది విద్యార్థినులు అనారోగ్యం బారిన పడ్డారు) మరణించిన విషాదకర ఘటనపై ఆయన జిల్లా అధికారులు, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందిని అడిగి వివరాలు తెలుసుకున్నారు.
గురుకుల పాఠశాలల్లో విద్యార్థినులు అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తనను తీవ్రంగా కలచివేసిందని పవన్ కల్యాణ్ ఒక ప్రకటనలో తెలిపారు. మృత్యువాత పడిన ఇద్దరు బాలికల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కలుషిత తాగునీరు లేదా పరిశుభ్రత లోపం కారణంగానే ఈ వ్యాధి వ్యాపించినట్లు వస్తున్న ప్రాథమిక నివేదికల నేపథ్యంలో, ప్రభుత్వం దీన్ని అత్యంత తీవ్రంగా పరిగణిస్తుందన్నారు.
కూటమి ప్రభుత్వం బాధ్యత వహించి, ప్రస్తుతం ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాలికలకు అత్యుత్తమ మెరుగైన వైద్య సేవలు అందించేందుకు సిద్ధంగా ఉందని ఆయన హామీ ఇచ్చారు. పరిస్థితిని నిరంతరం సమీక్షించేందుకు అదనపు వైద్య సిబ్బందిని నియమించాలని, ప్రత్యేకించి కింగ్ జార్జ్ హాస్పిటల్ (KGH)కి తరలించిన విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు నివేదిక అందించాలని అధికారులను ఆదేశించారు.
ఈ విషాదానికి కారణమైన నిర్లక్ష్యాన్ని పరిశీలించి, తక్షణమే పరిస్థితిని చక్కదిద్దేందుకు త్వరలోనే తాను కురుపాంలో పర్యటించనున్నట్లు పవన్ కల్యాణ్ ప్రకటించారు. ప్రభుత్వ గురుకులాల్లో చదివే పేద విద్యార్థినుల ఆరోగ్యం విషయంలో ఎటువంటి రాజీ ఉండబోదని ఆయన స్పష్టం చేశారు.


